
బలమున్న చోట బరి గీసి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్‌లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్‌రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్‌లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్‌లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదేని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్‌గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా బుధవారం ఉమ్మడి వరంగల్‌కు చెందిన సీపీఎం పార్టీ నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, వేంనరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.
‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు..
కాంగ్రెస్‌తో ‘కామ్రేడ్’లు ముందుకు
నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి...
ఎంపీటీసీ, సర్పంచ్‌లకూ పోటీ

బలమున్న చోట బరి గీసి..!