
స్థానికంపై ఫోకస్
● వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు
● పావులు కదుపుతున్న నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. హస్తం సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, కాషాయ పార్టీ ఖాతా తెరవలేదు. అయితే ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
– మెదక్‌జోన్
స్థానిక పోరుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, మెతుకుసీమలో మాత్రం ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెదక్‌లో కాంగ్రెస్ గెలుపొందగా, నర్సాపూర్ అసెంబ్లీ స్థానం మాత్రం బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. ఎంపీ రఘునందన్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధి ంచారు. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపొందారు. జిల్లాలో మూడు ప్రధాన పార్టీలను ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
గత ఎన్నికల్లో కారుదే హవా
జిల్లాలో 2019లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హవా కొనసాగింది. అప్పట్లో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 18 చోట్ల బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి. దీంతో జెడ్పీ పీఠం గులాబీ పార్టీ కై వసం చేసుకుంది. అలాగే మండల పరిషత్ స్థానాలు 189 ఉండగా, 117 చోట్ల బీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ 44 చోట్ల గెలుపొందగా, ఇతరులు 28 చోట్ల విజయం సాధించారు. దీంతో 20 ఎంపీపీ స్థానాలకు 14 చోట్ల బీఆర్‌ఎస్, 4 చోట్ల కాంగ్రెస్, ఇతరులు 2 స్థానాలు కై వసం చేసుకున్నారు.
ఈసారి త్రిముఖ పోటీ
ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగనుంది. అధికార కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంది. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇన్‌చార్జి మంత్రి వివేక్ జిల్లాలో పర్యటించి శ్రేణులను సమాయత్తం చేశారు. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఎజెండాగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇదే విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. జీఎస్టీ శ్లాబుల తగ్గింపును తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఎంపీ రఘునందన్‌రావు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నా రు. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సైతం గతంలో జిల్లాలో పర్యటించి క్యాడర్‌లో జోష్ నింపారు.