
సింగూరు రికార్డు బ్రేక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు వరద జలాల రికార్డులు బ్రేక్ అయింది. ఈ వర్షాకాలం సీజనులో ఇప్పటి వరకు ఏకంగా 200 టీఎంసీల వరద జలాలు ఈ ప్రాజెక్టులోకి వచ్చాయి. దీంతో వరద నీటిని ప్రాజెక్టు గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి వదలేశారు. ప్రాజెక్టు చరిత్రలో ఇంత రికార్డు స్థాయిలో వరద జలాలు నదిలోకి వదలడం ఈ ఏడాదే మొదటిసారని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 1989లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 1998–99లో ఈ ప్రాజెక్టుకు 176 టీఎంసీల వరద వచ్చినట్లు నీటి పారుదల రికార్డులు చెబుతున్నాయి. 2010 –11 సంవత్సరంలో కూడా భారీగానే వరద వచ్చింది. ఆ సంవత్సరం 106 టీఎంసీల వరద వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2016–17లోనూ 105 టీఎంసీలు, 2021–22లో 101 టీఎంసీలు వచ్చి ంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఈసారి ఏకంగా 200 టీఎంసీలు దాటడం గమనార్హం. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ఈ లెక్కన 200 టీఎంసీలతో సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో వరద జలాలు మంజీరా నది పాలయ్యాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కర్నాటక, మహారాష్ట్రల్లో క్యాచ్‌మెంట్..
జిల్లాలో ఉన్న ఏకై క బహుళార్థక సాధక ప్రాజెక్టుకు జిల్లాతో పాటుగా, కర్నాటక, మహారాష్ట్రల పరిధిలో క్యాచ్‌మెంట్ ఏరియా ఉంది. ఈ ఏరియాల్లో ఈసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుకు వరద జలాల రాక ఉధృతంగా సాగుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద జలాలను మంజీరా నదిలోకి వదులుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు ఆనకట్ట దెబ్బతిన్న నేపథ్యంలో డ్యాం సేఫ్టీ అధారిటీ నీటి నిల్వలను 16 టీఎంసీలకే పరిమితం చేయాలని సూచించింది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 16 టీఎంసీలకే పరిమితం చేస్తున్న విషయం విదితమే.
క్రాప్ హాలీడే ప్రకటించిన సంవత్సరంలో..
సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు ఈ ఏడాది ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా క్రాప్‌హాలీడే ప్రకటించిన సంవత్సరంలోనే ఇంత భారీ స్థాయిలో వరద రావడం గమనార్హం. మరోవైపు భారీ ఎత్తున వరద జలాలు రావడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్‌కోకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. నిర్దేశిత లక్ష్యం మేరకు ఈసారి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఈ జలాశయం ఆధారంగా ఉన్న ఘనపురం ఆనకట్టకు, కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి విడుదల చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌తో పాటు, మిషన్‌భగీరథ అవసరాల కోసం కూడా ఈ నీటిని వినియోగిస్తున్న విషయం విదితమే.
200 టీఎంసీలు దాటిన వరద జలాల రాక
1998–99లో వచ్చిన వరద 176 టీఎంసీలు
27 ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద
మంజీరా నది పాలైన జలాలు