
పకడ్బందీగా ఎన్నికలు
కౌడిపల్లి(నర్సాపూర్): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌హాల్ కోసం మండలంలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్‌ఎస్ శ్రీహరి, సర్వేయర్ మొగులయ్య తదితరులు ఉన్నారు.
నర్సాపూర్: తమకు ఏడు నెలలుగా జీతాలు లేవని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీ ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ ఎదుట బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, తమనే పర్మనెంట్ చేయాలని, అప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిట్ మేరకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ జేఏసీ నాయకులు సురేష్, సువర్ణ తదితరులు ఆరోపించారు.
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. మొదట రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేసిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్): స్థానిక ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం మండల కేంద్రానికి చేరుకున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి గాను 61 పోలింగ్ కేంద్రాల పరిధిలో 73 బ్యాలెట్ బాక్సులు మండల కేంద్రానికి రాగా, వాటిని మండల పరిషత్ కార్యాలయంలో భద్రపర్చారు.
నారాయణఖేడ్: ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమ వారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం, నకిరేకల్, భువనగిరి ఎ మ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, అనిల్‌కుమారెడ్డి తదితరులు ఉన్నారు.