సామాజిక భద్రతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

సామాజిక భద్రతకు భరోసా

Oct 7 2025 5:02 PM | Updated on Oct 7 2025 5:02 PM

సామాజ

సామాజిక భద్రతకు భరోసా

వృద్ధులు, కిశోర బాలికలకుకొత్త సంఘాలు

కొనసాగుతున్న అర్హుల గుర్తింపు

రామాయంపేట(మెదక్‌): ఆదరణ కరువైన వృద్ధులు, కిశోర బాలికలను గుర్తించి ఆదుకోవడంతో పాటు వారితో వేర్వేరుగా సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లావ్యాప్తంగా సభ్యుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో గ్రూపులకు సంబంధించి సభ్యుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న మహిళా సమాఖ్య, దివ్యాంగుల సంఘాలతో పాటు అదనంగా కిశోర బాలికలు, వృద్ధులతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామ సంఘం కనీసం ఒక గ్రూపు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

60 ఏళ్లు నిండిన మహిళలకు మళ్లీ అవకాశం

సాధారణంగా 60 ఏళ్లు నిండిన మహిళలు మహిళా సంఘాల్లో ఉండటానికి నిబంధనలు అంగీకరించవు. వారు సంఘం నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. ప్రస్తుతం వారిని గుర్తించి ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 21 గ్రూపులను ఏర్పాటుచేసిన అధికారులు 210 మందిని సభ్యులుగా చేర్పించారు. మేమున్నామని వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు. సంఘంలో సభ్యులుగా ఉన్న వృద్ధులు తమ వారి ఆదరణకు దూరమైతే వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు. ఈమేరకు వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా రివాల్వింగ్‌ ఫండ్‌ మంజూరు చేయనున్నట్లు సమాచారం. అలాగే 14 నుంచి 18 ఏళ్ల బాలికలను గుర్తించి వారితో ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 43 సంఘాలను ఏర్పాటు చేసిన అధికారులు 430 మందిని సభ్యులుగా చేర్పించారు. వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొవడం వంటి విషయాల్లో చైతన్యపరుస్తామని అధికారులు చెబుతున్నారు.

కొత్త ఎస్‌హెచ్‌జీలకు కసరత్తు

మహిళా సంఘాల్లో ఇప్పటివరకు సభ్యులుగా చేరని వారిని గుర్తించి వారితో కొత్త సంఘాలు ఏర్పాటు చేయించడానికి గ్రామాల వారీగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 56 సంఘాలను ఏర్పాటు చేసి 560 మందిని సభ్యులుగా చేర్పించారు. వీరికి పొదు పు చేయడం, సంఘాల బాధ్యతల విషయమై అవగాహన కల్పిస్తున్నారు.

దివ్యాంగులతో సైతం..

అలాగే జిల్లాలో గతంలో ఉన్న 172 సంఘాలకు తోడు కొత్తగా అదనంగా మరో 14 దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం తోడ్పాటు అందించే విధంగా కృషి చేస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పనిముట్లు, పరికరాల్లో ప్రాధాన్యం ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా పథకాలను వర్తింపజేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ప్రోత్సాహం అందిస్తాం

జిల్లాలో ఉన్న పాత మహిళా సంఘాలకు తోడు కొత్తగా మరిన్ని సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధులతో పాటు కొత్తగా కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంఘాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, తోడ్పాటు అందే విధంగా కృషి చేస్తాం.

– శ్రీనివాస్‌,

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

సామాజిక భద్రతకు భరోసా1
1/1

సామాజిక భద్రతకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement