
కొల్చారం వైపు పెద్దాయన చూపు
● హాట్‌టాపిక్‌గా జెడ్పీటీసీ స్థానం ● అన్‌రిజర్వ్‌డ్ కావడంతో పోటీకి పలువురు సై..
కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో కొల్చారం జెడ్పీటీసీ స్థానం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. బీసీ రిజర్వేషన్‌తో ఇక్కడి జెడ్పీటీసీ స్థానం అన్ రిజర్వ్‌డ్ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. గత ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ పెద్దాయన ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ముందస్తు హామీ పొందినట్లు సమాచారం. అయితే ఆయన సొంత మండల జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్ కావడంతో పోటీ చేయలేని పరిస్థితి. దీంతో తనకు అనుకూలంగా ఉన్న కొల్చారం స్థానంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇక్కడి నాయకులతో మంతనాలు జరపడం, గత అనుభవాన్ని రంగరిస్తూ తనకు పూర్తి మద్ధతు ఇవ్వాలంటూ కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు చెందిన యువ నాయకులు సైతం నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. తాము బరిలో ఉన్నామన్న సంకేతాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసుకుంటున్నారు. ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం యువ నాయకులకు కాకుండా స్థానికంగా ఉన్న సీనియర్లు, మరో బయటి వ్యక్తిని పోటీగా తీసుకువస్తారని సమాచారం. స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు ఈనెల 8న ఉండటంతో అప్పటికీ బరిలో ఎవరు ఉంటారన్నది అధికారికంగా స్పష్టత రానుంది.