
అన్నదాతకు వరుణ గండం
మెదక్‌జోన్: ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతన్నకు పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తునాయి. ఆదివారం జిల్లాలోని పలు మండలాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికోత దశలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వదలని వానతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కర్షకులు కొట్టుమిట్టాడుతున్నారు.
503 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో దొడ్డు రకం 2.28 లక్షలు, సన్నాలు 77 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకోసం 7.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 3.39 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు ఆహారం కోసం నిల్వ ఉంచుకుంటారు. విత్తన కంపెనీలకు కొంతమేర పోనూ, మరికొంత బయట వ్యాపారులకు విక్రయిస్తారని భావిస్తున్నారు. అదిపోను కొనుగోలు కేంద్రాలకు 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
3 గంటలు.. 12 సెంటీమీటర్లు
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 3 గంటల పాటు వర్షం దంచికొట్టింది. జిల్లాలోని చిన్నశంకరంపేట, చేగుంట, మెదక్, హవేళిఘణాపూర్, నార్సింగి, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, పాపన్నపేట, టేక్మాల్, చిలప్‌చెడ్ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికే మొక్క జొన్న పంటను కోసి ఆరబెట్టగా, 40 శాతం వరి పంటలు కోతకు వచ్చాయి. కానీ వర్షాల కారణంగా పంట చేతికందుతుందా..? లేదా అని రైతు లు ఆందోళన చెందుతున్నారు.
కోత కోయలేరు.. ఆరబెట్టలేరు
ఈ ఏడాది భారీ వర్షాలతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కాగా మిగిలిన పంటనైనా కోసి అమ్ముకుందామంటే వర్షాలు వెంటాడుతున్నాయి. చైన్ మిషన్లతో వరి పంటను కోసినా, ధాన్యాన్ని ఆయబెట్టలేని దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరికోతల వేళ వెంటాడుతున్న వర్షాలు
ధాన్యం కొనుగోళ్లకు అధికారుల ఏర్పాట్లు
జిల్లాలో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా