
హస్తంలో నిస్తేజం
ఆసక్తి చూపని నాయకత్వం
మెదక్ అర్బన్: ఈనెల 5వ తేదీకల్లా జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు అర్హులను గుర్తించి, ఒక్కోస్థానం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను గాంధీ భవన్‌కు పంపాలని పీసీసీ ఆదేశించినా.. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్నికల సందడి కనిపించడం లేదు. స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, అభ్యర్థుల పేర్లు గుర్తిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల గాంధీభవన్ వర్గాలు మాత్రం కొంతమంది కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులకు ఫోన్ చేసి ఆశావహుల వివరాలు అడిగినట్లు సమాచారం.
ఆశావహుల్లో ఆందోళన
జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, మెదక్ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈనెల 5 కల్లా జెడ్పీటీసీ స్థానాలకు ఆశావహులను గుర్తించి, ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపాలని జిల్లా పార్టీ కమిటీలను పీసీసీ ఆదేశించింది. జిల్లాకు చెందిన, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కానీ ఇప్పటివరకు అలాంటి సమావేశాలు ఏర్పాటు కాలేదని మండల కార్యవర్గాలు అంటున్నాయి. ఓ వైపు ముగ్గురేసి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి పీసీసీకి పంపాలనే సూచనలు ఉన్నాయి. కాగా రెండు, మూడు రోజుల కింద పీసీసీ వర్గాలు, కొంతమంది మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులకు ఫోన్లు చేసి, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారి వివరాలు అడిగినట్లు తెలుస్తుంది. అయితే వారు తమకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పినట్లు సమాచారం.
మెదక్ నియోజకవర్గంలో పోటాపోటీ
మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలంలో కాంగ్రెస్ నుంచి పంతుల భూమన్న, శ్రీకాంతప్ప, రమేశ్‌గౌడ్, రాజశేఖర్, భరత్‌గౌడ్, సూఫీ, మెదక్ మండలం జెడ్పీటీసీకి శంకర్, నాగరాజు, మురళి, హవేళిఘణాపూర్ మండలం నుంచి శ్రీనివాస్, పరుశురాంగౌడ్, చిన్నశంకరంపేట నుంచి సాన సత్యనారాయణ, భిక్షపతి, ప్రభాకర్, పడాల సిద్దిరాములు, రామాయంపేట నుంచి మహేందర్ రెడ్డి, మోహన్‌నాయక్, శివప్రసాద్‌రావు, నిజాంపేట నుంచి వెంకటేశంతో పాటు ఇంకా కొంతమంది నాయకులు జెడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.
పేర్లు పంపిస్తాం
పీసీసీ సూచన మేరకు ఆదివారం సాయంత్రానికల్లా ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పంపిస్తాం. ఇప్పటికే మండలాల వారీగా సమాచారం సేకరించాం. కొన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న వారి పేర్లు తీసుకున్నాం.
– ఆంజనేయులు గౌడ్, డీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్‌లో ఖరారు కాని ఆశావహుల పేర్లు
మండల సమావేశాలు నిర్వహించని వైనం
5 వరకు జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా పంపాలని కోరిన అధిష్టానం
రాజకీయాల్లో అనాధిగా అగ్రవర్ణ నాయకుల అధిపత్యం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఓసీలకు చాలా చోట్ల రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కూడా రాజకీయ వాతావరణాన్ని రగిలించడం లేదు. దీంతో చాలా చోట్ల ఎన్నికల సన్నాహక సమావేశాలు జరుగలేదని తెలుస్తోంది.