
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
పాత చిక్కులు..
కొత్త ముడులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి తెరపైకి వస్తోంది. పలు నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులు తయారైన నేపథ్యంలో ఈ ఎన్నికల టికెట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ దృష్టి సారించింది. ప్రధానంగా జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో మండలానికి ముగ్గురు చొప్పున పేర్లతో నియోజకవర్గాల వారీగా జాబితాను రూపొందిస్తోంది. గ్రూపు విభేదాలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది ఆ పార్టీలో ప్రహసనంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జహీరాబాద్‌లో గ్రూపుల లొల్లి..
జహీరాబాద్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. ఇక్కడ పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్‌రెడ్డి వర్గాలు ఎవరికి వారే అన్నచందంగా తయారయ్యాయి. ఈ గ్రూపులకు తోడుగా ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరవర్గం కూడా మరో వర్గంగా వ్యహరిస్తోంది. అప్పట్లో ముగ్గురు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఆయా వర్గాల నేతలు పట్టుబట్టే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ ఎవరి అనుచరులకు టికెట్లు దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది.
ఖేడ్‌లోనూ అంతర్గతంగా ఆధిపత్య పోరు
నారాయణఖేడ్‌లోనూ కాంగ్రెస్ కేడర్ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ అనుచరుల మధ్య ఆధిపత్య పోరు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బయట పడకపోయినా..అంతర్గతంగా మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నర్సాపూర్‌లోనూ అదే తీరు
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోనూ హస్తం పార్టీ కేడర్ రెండు గ్రూపులుగా తయారైంది. నియోజకవర్గం ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి వర్గంతోపాటు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సన్నిహితంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినీరెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాముగానే మారింది. ఎవరికి వారే తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రూపులున్న చోట్ల ప్రత్యేక కమిటీలు
గ్రూపుల లొల్లి తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ పరిశీలిస్తోంది. ఆయా వర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో వడపోత కార్యక్రమం చేపట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తామని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. అవసరమైతే సర్వే నిర్వహించి టికెట్లు కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
ఒక్కో నియోజకవర్గంలో రెండు, మూడు గ్రూపులు
ఏ గ్రూపునకు ‘స్థానిక’ టికె ట్లు
దక్కుతాయనే దానిపై ఆసక్తి
తమ అనుచరులకు
టికెట్లు ఇప్పించుకునేందుకు నేతల పట్టు
పలు నియోజకవర్గాల్లో
హస్తం పార్టీలో ఇదీ పరిస్థితి
ఇప్పటికీ పలుచోట్ల
బయటపడుతున్న విభేదాలు
సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలు
వేసే యోచనలో పార్టీ నాయకత్వం!

ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025