స్థానికంగానే నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

స్థానికంగానే నామినేషన్లు

Oct 6 2025 2:10 AM | Updated on Oct 6 2025 2:10 AM

స్థానికంగానే నామినేషన్లు

స్థానికంగానే నామినేషన్లు

డిపాజిట్‌ తప్పనిసరి..

ఎంపీడీఓ కార్యాలయాల్లోనే కౌంటర్లు

21 ఏళ్లు నిండిన వారే పోటీకి అర్హులు

నారాయణఖేడ్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు స్థానికంగా మండల పరిషత్తు కార్యాలయాలు (ఎంపీడీఓ)ల్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానానికి గానీ, జెడ్పీటీసీ స్థానానికి గాను ఆయా మండలాలకు సంబంధించిన వారు సదరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసే కౌంటర్‌లో ఆర్వోలకు తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ స్థానం ఎన్నికల నిర్వహణకు గాను గెజిటెడ్‌ హోదా ఉన్న హెడ్‌మాస్టర్లు, లెక్చరర్లు, ఇతర అధికారులను రిటర్నింగ్‌ అధికారిగా నియమించనున్నారు. సదరు అధికారి తాను పనిచేసే మండలం, సొంత మండలం రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ఇతర మండలాల వారిని ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారు. జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఆ క్లస్టర్‌ పరిధిలో వచ్చే ఎంపీటీసీ స్థానాల వివరాలను సంబంధిత ఆర్వోల వద్ద ప్రదర్శిస్తారు. తొలివిడత పరిషత్‌ ఎన్నికల కోసం ఈ నెల 9న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. పోటీ చేసే అభ్యర్థితోపాటు ముగ్గురికి మాత్రమే నామినేషన్‌ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. నామినేషన్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలకు అనుమతులు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి వయస్సు నామినేషన్ల స్వీకరణ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కేటగిరీని బట్టి డిపాజిట్‌ చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, జెడ్పీటీసీ జనరల్‌ అభ్యర్థులు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2,500, గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసే జనరల్‌ అభ్యర్థి రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1000, వార్డు సభ్యుడు జనరల్‌ అభ్యర్థి రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250లు చెల్లించాలి. పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీకి పన్ను బకాయి, కరెంటు బిల్లులు క్లియర్‌ చేసి ఆ రశీదును తీసుకోవాల్సి ఉంటుంది. తమ నామిషన్ల సందర్భంగా కులధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement