
శ్రీశైలం ట్రస్టు బోర్డులోకి కట్టా సుధాకర్‌రెడ్డి
అచ్చంపేట: శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు గా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కట్టా సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఏబీవీపీ, బీజేపీలో కీలకంగా పనిచేస్తున్న ఆయనకు అవకాశం రావడంపై నల్లమల్ల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం బోర్డులో అచ్చంపేట ప్రాంతానికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు విన్నవించారు. వారం రోజుల క్రితం అమరావతిలో కలిసి కూడా వినతిపత్రం అందజేశారు. మొదటిసారి అచ్చంపేట ప్రాంతానికి అవకాశం దక్కింది.
కారు, బైక్ ఢీ..
వ్యక్తికి తీవ్రగాయాలు
కొత్తకోట రూరల్: కారు, బైక్ ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని కనిమెట్ట గ్రామ సమీపంలో ఎన్‌హెచ్–44పై శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కానాయపల్లి గ్రామానికి చెందిన నరేందర్ పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా కనిమెట్ట సమీంలో ఫుడ్ పిరమిడ్ దగ్గర హైదరాబాద్ వైపు నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్‌బ్రేక్ వేయడంతో బైక్ కారును వెనుక నుంచి ఢీకొనడంతో బైక్‌పై ఉన్న నరేందర్ రోడ్డుపై కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే సమీపంలో ఉన్న కనిమెట్ట గ్రామస్తులు క్షతగాత్రుడిని 108లో వనపర్తి ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఆనంద్ తెలిపారు.