
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ‘చలో హైదరాబాద్’
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ సమస్యల పరిష్కారానికి సోమవారం హైదరాబాద్‌లోని భర్కత్‌పుర పీఎఫ్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు, ఉపాధ్యక్షులు జీబీ పాల్, భగవంతు తెలిపారు. శనివారం స్థానిక ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీఎఫ్ కార్యాలయం నుంచి వచ్చిన డిమాండ్ లేఖలపై అనేక మంది విశ్రాంత ఉద్యోగులు గతేడాది నుంచి హయ్యర్ పెన్షన్ మంజూరుకు రూ.లక్షలు డీడీల రూపంలో చెల్లించినా ఇంత వరకు పెన్షన్ మంజూరు చేయలేదన్నారు. అనేక మంది విశ్రాంత ఉద్యోగులకు ఇంత వరకు డిమాండ్ లేఖలను కూడా పంపలేదని, ఇంకొందరికి హయ్యర్ పెన్షన్ ఏరియర్స్ చెల్లించలేదని ఆరోపించారు. పెన్షనర్ల సమస్యల పట్ల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నారాయణ, నాగాంజనేయులు, అంజన్న, నర్సింహులు, బీహెచ్ కుమార్, సలీం, రియాజొద్దీన్, డేవిడ్, లలితమ్మ, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.