
శ్రీశైలం ప్రాజెక్టుకు నిలకడగా వరద
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతుంది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 31 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 4,62,448, సుంకేసుల నుంచి 30,736, హంద్రీ నుంచి 10,300 మొత్తం 5,03,484 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం పది గేట్లు ఒక్కొక్కటి 23 అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 5,76,940, కుడి, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 64,211 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.1 అడుగుల వద్ద 205.2258 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,063 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమ భూగర్భ కేంద్రంలో 16.111 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 14.590 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.