
కాళరాత్రిదేవీ.. నమోస్తుతే
● అలంపూర్ జోగుళాంబ క్షేత్రంలోవైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
● తరలివచ్చిన భక్తజనం
అలంపూర్: మహిమాన్వితమూర్తి కాళరాత్రిదేవీ నమోస్తుతే.. అంటూ భక్తులు జోగుళాంబ అమ్మవారిని పూజించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూర్ ఆలయంలో ప్రత్యేక మండపంలో అమ్మవారు కొలువుదీరగా.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం అమ్మవారు కాళరాత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈమేరకు అమ్మవారికి అర్చకులు ప్రేత్యక పూజలు, మహా మంగళహారతి ఇచ్చారు. ఆకాశంలో ఉండే మబ్బుల రంగును కలగలుపుకొని.. నల్లటి రూపంతో అతి భీకరంగా అమ్మవారు దర్శనిస్తారని అర్చకులు వివరించారు. అదేవిధంగా యాగశాలలో చండీహోమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఇదిలాఉండగా, క్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు, ప్రముఖలు తరలివచ్చారు. దీంతో జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాల వద్ద పెద్దసంఖ్యలో క్యూలో బారులుతీరారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేశారు. అలాగే, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. బాలబ్రహ్మేశ్వరస్వామి నిత్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం చేశారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగుళాంబ క్షేత్రంలో సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గద్వాల సంస్థానం అధ్వర్యంలో గుడి సంబురాల పేరిట సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు. ఆలయ అధికారులు కళాకారులకు ప్రశంశా పత్రాలను అందజేశారు.

కాళరాత్రిదేవీ.. నమోస్తుతే