
పత్తి రైతు చిత్తు
●అధిక వర్షాలతో
రంగు మారుతున్న పత్తి పైరు
● పూత రాలిపోయి కాపు లేక
వెలవెలబోతున్న వైనం
● క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో తీవ్రంగా నష్టం
● పెట్టుబడులు కూడా రాని వైనం
ఈ ఏడాది పత్తి పంట ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడులు కూడా రావు. వర్షాలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. పెరిగిన పెట్టుబడులు, కౌలుతో పత్తి రైతుకు నష్టం తప్పదు.
– ఎన్.లక్ష్మీనారాయణ, మక్కపేట, వత్సవాయి మండలం
వ్యవసాయాధికారులు గ్రామాలలో పర్యటించి నష్టపోయిన పత్తి పంటను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించాలి. వ్యవసాయశాఖ నివేదిక మేరకు నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలి.
– కనగాల రమేష్, వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు
వత్సవాయి/జి.కొండూరు: ఈ ఏడాది పత్తి పంట రైతులను చిత్తు చేసింది. అధిక వర్షాలకు గిడసబారి పత్తి కాయ పగిలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి తీతకు వచ్చే దశలో వర్షాలు పడుతుండడంతో పూత రాలిపోయి, కాయలు మచ్చలు వచ్చి రాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. నష్టాల్లో ఆదుకునే క్రాప్ ఇన్సూరెన్స్ సైతం ప్రభుత్వం తొలగించడంతో నష్టాలను పూడ్చుకునే మార్గం కనిపించక పత్తి రైతులు లబోదిబోమంటున్నారు.
భారీగా పెరిగిన పెట్టుబడులు...
గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు ధర రూ.20 వేల వరకు ఉండగా, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతుంది. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.7 వేలు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. లేనిపక్షంలో నష్టాలు తప్పవు.
మొక్కజొన్న సాగుపై ఆశ...
పత్తి పంట దెబ్బతినడంతో రెండవ పంటగా రైతులు మొక్కజొన్నపై ఆశలు పెట్టుకుంటున్నారు. తీతకు వచ్చిన పత్తిని తీసుకుని వెంటనే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న పంట వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది కూడా పత్తి పంట నష్టం రావడంతో రెండవ పంటగా మొక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి క్వింటా రూ.2 వేల పైనే పలకడంతో రైతులకు కొంత ఊరట లభించింది. ఈ సీజన్ కూడా రైతులు మొక్కజొన్నపైనే ఆశలు పెట్టుకుంటున్నారు.

పత్తి రైతు చిత్తు

పత్తి రైతు చిత్తు

పత్తి రైతు చిత్తు