
ఒక్క రోజులో బెజవాడ రైల్వే డివిజన్‌కు రూ.5 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఒకేరోజు అత్యధిక మంది ప్రయాణికుల నిర్వహణ, ఆదాయంలో విజయవాడ డివిజన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈనెల 4న విజయవాడ డివిజన్ నుంచి ఇతర ప్రాంతాలకు 2.8 లక్షల మంది ప్రయాణికుల రవాణా ద్వారా రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. ఇది కేవలం ఒక్కరోజులో డివిజన్ సాధించిన సరికొత్త మైలురాయిగా నిలిచింది. దీంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ డివిజన్‌కు వచ్చే ప్రయాణికులతో కలుపుకొని మొత్తం 5.5 లక్షల మంది ఒక్క రోజు ప్రయాణం చేశారు. అందులో విజయవాడ స్టేషన్ నుంచి 82 లక్షల మంది ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం ద్వారా రూ.2 కోట్లు ఆదాయం వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ స్టేషన్‌లో దిగిన వారితో కలుపుకొని 1.7 లక్షల మంది ప్రయాణికులుగా నమోదైంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదలను సమర్థంగా నిర్వహించడానికి డివిజన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో అదనంగా 25 బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్‌లను ప్రారంభించారు. 72 ఏటీవీఎం (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్‌లు) ఏర్పాటు, ప్రయాణికులకు సహాయం చేసేందుకు 110 ఏటీవీఎం ఫెసిలిటేటర్లను 24 గంటలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా అరుదైన రికార్డు సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.