
ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఏపీఆర్ స్కూల్ తరలింపుపై కొనసాగుతున్న సందిగ్ధం ఆందోళనలో మైనార్టీ బాలికల తల్లిదండ్రులు విద్యాసంవత్సరం మధ్యలో పాఠశాల తరలింపు అన్యాయం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక గురుకుల (మైనార్టీ బాలికల) పాఠశాలను తరలించా లని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర (బొద్దనపల్లి) గ్రామంలో పొలాల మధ్యలో ఉన్న పాత కాలేజీ భవనంలోకి తరలించాలని ఏపీఆర్ సూల్స్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య గత నెల ఐదో తేదీన ఉత్వర్వులు ఇచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి ఏపీఆర్ స్కూల్స్ ఉన్నతాధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ గుట్టు చప్పుడు కాకుండా, విద్యార్థినుల తల్లిదండ్రులకు ముందస్తు సమా చారం ఇవ్వకుండా పాఠశాలను తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గత నెల 25వ తేదీ నుంచి స్కూల్ పేరెంట్స్ కమిటీ, పిల్లల తల్లిదండ్రులకు విషయం తెలిసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు గత నెల 28న పాఠశాల వద్దకు వచ్చి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. పాఠశాలను ఇప్పటికిప్పుడు తరలించొద్దని సంబంధిత అధికారులను కోరారు. అదే రోజు సాయంత్రం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ కూడా పేరెంట్స్‌తో మాట్లాడి సమస్య తెలుసు కుని పరిష్కరిస్తామని, భయపడవద్దని హామీ ఇచ్చారు. అయినా పాఠశాల తరలింపుపై నేటి వరకు సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అయితే గురుకుల పాఠశాల గోడలకు పాఠశాలను బొద్దనపల్లికి మారుస్తున్నామంటూ పాఠశాల భవనం ఫొటోలను శుక్రవారం అంటించడం గమనార్హం.
విద్యాసంవత్సరం మధ్యలో వద్దు
గురుకుల పాఠశాల తరలింపుపై తమకు అభ్యంతరం లేదని, అయితే ఎన్టీఆర్ జిల్లాలోనే రవాణా వసతి, సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి తరలించా లని విద్యార్థుల తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి వారు రోజూ భవానీపురంలోని పాఠశాల వద్దకు వచ్చి, విద్యా సంవత్సరం పాఠశాలను తరలించడం అన్యాయమని వాపోతున్నారు. కనీసం ఈ విద్యాసంవత్సరం ముగిశాక పాఠశాలన తరలించాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడుతున్నారు. తమకు ఇష్టమైతే వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో పిల్లలను కొనసాగిస్తామని, లేకపోతే టీసీలు తీసుకుని వేరే పాఠశాలలో చేర్పిస్తామని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడున్న పాఠశాలకు కూతవేటు దూరంలో గొల్లపూడి పరిధిలోని హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న భవనాన్ని ఇదే అద్దె ప్రాతిపదికపై తాము ప్రిన్సిపాల్‌కు చూపించామని, అక్కడికి తరలించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచించి, విద్యా సంవత్సరం పూర్తయిన తరువాత మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పిల్లలపై బాధ్యత ఏదీ?
పాఠశాల నగరంలో ఉంది కదా అని ఆడపిల్లలను ఇక్కడ చేర్పిస్తే, ఎటువంటి రక్షణ, భద్రత లేని మారుమూల పల్లెకు తీసుకెళ్తే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు జరగరానిదేదైనా జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించి మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైన కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ధైర్యంతో తమ కుమార్తెలను పొలాల మధ్య ఉన్న భవనంలోకి పంపగలమని కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లలో స్పందన లేదని వాపోతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వ నిర్ణయమని తప్పించుకోవడంపై మండిపడుతున్నారు.
బాలికల మంచి కోసమే..
గురుకుల పాఠశాల తరలింపుపై ఏపీఆర్ స్కూల్స్ ఆంధ్ర, రాయలసీమ రీజియన్ల డెప్యూటీ సెక్రటరీలు సురేష్ బాబు, ఉబేదుల్లా (ఆర్‌డీ సీలు)ను వివరణ కోరగా.. గురుకుల పాఠశాల అంటేనే పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. బాలికల మంచి కోసమే ఈదర గ్రామానికి పాఠశాలను తరలిస్తున్నామని, పిల్లలకు అక్కడ అలవాటయితే ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల ఆగ్రహం

ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల ఆగ్రహం