
పనులను వేగవంతం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య, ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సంబంధిత మునిసిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, పెడన పట్టణ ప్రాంతాల్లో పది ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు మచిలీపట్నం, ఉయ్యూరు, పెడనలో ఒక్కొక్క ఆరోగ్య కేంద్రమే పూర్తయిందని కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, గుడివాడలో టెండర్ల ప్రక్రియలోనే ఉందని వివరించారు. మచిలీపట్నం నారాయణపురంలో స్థలం త్వరితగతిన ఎంపిక చేయాలన్నారు. తాడిగడప మునిసిపాలిటీలో కానూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. అమాత్ 2.0 పథకం కింద మచిలీపట్నం, గుడివాడ, పెడన, తాడిగడప మునిసిపాలిటీల్లో రూ.181.31 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తాగునీటి పైపులతో కలవకుండా చూడాలని, లీకేజీ ఉండకుండా కాంట్రాక్టర్లు వాటిని సరిగా నిర్మిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని సూచించారు. మచిలీపట్నంలో ఇంకా మిగిలిపోయిన 30 వేల టన్నుల వ్యర్థాల చెత్త బుట్టలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెడన మునిసిపాలిటీలో పది రోజుల్లో పూర్తిగా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను తొలగించిన ప్రదేశం ఆక్రమణకు గురికాకుండా నిఘా ఉంచి పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహరరావు, నజీర్, రామారావు, ప్రజారోగ్యశాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ బాలాజీ