
మునేరులో గల్లంతయిన కీర్తన మృతి
కంచికచర్ల: మండలంలోని వేములపల్లి గ్రామం వద్ద శుక్రవారం నాయనమ్మతో కలసి దుస్తులు ఉతికేందుకు వెళ్లి మునేరులో గల్లంతైన బాలిక మృతిచెందింది. మునేరులో గల్లంతయిన ఉప్పెల్లి కీర్తన (10) ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృంద సభ్యులు శనివారం ఉదయం ఆరు గంటలకు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో కీర్తన మృతదేహం లభించింది. నాటు పడవ సాయంతో కీర్తన మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన తల్లి మరియమ్మ, నాయనమ్మ గుండెలవిసేలా రోదించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పెనుగంచిప్రోలు మండలం గుమ్ముడుదుర్రు గ్రామానికి చెందిన కీర్తన రెండో తరగతి చదువుతోంది. దసరా సెలవులను ఆదనందంగా గడిపేందుకు నాయనమ్మ ఇంటికి వచ్చింది. శుక్రవారం కీర్తన నాయనమ్మ రమణతో కలసి దుస్తులు ఉతికేందుకు మునేరు వద్దకు వెళ్లింది. నీటిలో దిగి గల్లంతయిన కీర్తన శవమై కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.విశ్వనాథ్ తెలిపారు.
మునేరులో అక్రమ తవ్వకాలే కారణం
కూటమి నాయకులు వేములపల్లి వద్ద మునేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపటం వల్లే అక్కడక్కడా లోతు ఎక్కువగా ఉందని, ఇసుక తవ్విన గోతిలో పడి కీర్తన మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మునేరులో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపినా రెవెన్యూ, మైనింగ్, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మునేరులో అక్రమ తవ్వకాలు జరపకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.