
చెడుగుడు పోటీ విజేత నెల్లూరు పల్లాలమ్మ జట్టు
పెడన: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పెడన మండలం లంకలకలువగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీల్లో విజేతగా నెల్లూరు జిల్లాకు చెందిన పల్లాలమ్మ జట్టు విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్స్‌లో ఏలూరు జిల్లా వేమవరప్పాడు జట్టు, పల్లాలమ్మ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో పల్లాలమ్మ జట్టు విజయం సాధించింది. గత నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిగా రూ.20వేలను కొనకళ్ల బ్రదర్స్ వారి తండ్రి గణపతి పేరు మీద అందజేశారు. ద్వితీయ బహుమతిని మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పేరు మీద ఆయన తనయుడు, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రూ.15వేలను అందజేశారు. తృతీయ బహుమతి రూ.10వేలను నెల్లూరు గణేష్ టీం గెలుచుకోగా పుల్లేటి వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు ఆ నగదును అందజేశారు. నాలుగో బహుమతిని లంకలకలువగుంట గ్రామ జట్టు రూ.5వేలు గెలుచుకుంది. పోటీలను ముత్యాల వెంకటస్వామి(ఏసుబాబు), మాజీ సర్పంచులు కట్టా సూర్యచంద్రరావు, కాగిత సత్యప్రసాద్ పర్యవేక్షించారు.