
హమ్మయ్య.. దసరా ముగిసింది!
సమస్యలు సృష్టించిన
విజయవాడ ఉత్సవ్
ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
కూటమి నేతల హడావుడితో
ఇక్కట్లపాలైన భక్తులు
పండుగ రోజు ట్రాఫిక్ కష్టాలు
గొల్లపూడి వైపు ఐదు కిలోమీటర్లు జామ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ)/లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు లేకుండా ముగియటంతో జిల్లా అధికార యంత్రాంగం హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంది. గత నెల 22 నుంచి ఈ నెల రెండో తేదీ వరకూ 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు కొనసాగాయి.
కొనసాగుతున్న భవానీల రాక
దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో చాలా మంది భక్తులు భవానీదీక్షలను స్వీకరించి, దీక్షా విరమణకు అమ్మవారి సన్నిధికి తరలివస్తారు. దాంతో గడిచిన రెండు రోజులుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి అధికంగా భవానీ దీక్షాపరులు అమ్మవారి సన్నిధికి తరలివస్తున్నారు. భవానీల రాకతో శుక్రవారం సైతం రద్దీ కొనసాగింది. మరో రెండు రోజుల పాటు భవానీల రాక కొనసాగనుంది.
కూటమి నేతల హడావుడితో ఇక్కట్ల పాలైన భక్తులు
ఈ ఏడాది కూటమి నాయకులు అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంపైన తమ ప్రతాపాన్ని చూపించారు. ఎటువంటి పాసులు లేకున్నా దర్శనానికి రావటం, అధికార యంత్రాంగంతో ఘర్షణకు దిగటంతో ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల సమస్యలు తలెత్తాయి. కొంతమంది మంత్రుల పీఏలు సైతం ఆలయంలో పోలీసు అధికారులను దుర్భాషలాడి ఘర్షణకు దిగిన సందర్భాలు ఉన్నాయి.
జంబో ఉత్సవ కమిటీతో సమస్యలు
దసరా ఉత్సవాల సందర్భంగా కూటమి ప్రభుత్వం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి జంబో ఉత్సవ కమిటీని నియమించింది. సుమారుగా 96 మందితో నియమించిన ఈ ఉత్సవ కమిటీ ఆలయ ప్రాంగణంలో అధికారులకు తలనొప్పిగా మారారని ఉన్నతాధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
చివరి రోజు ట్రాఫిక్‌తో భక్తుల అష్టకష్టాలు
దసరా పండుగ రోజు విజయవాడ నగరంలో ట్రాఫిక్ అష్టదిగ్బంధనం అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎంజీ రోడ్డులో డైవర్షన్‌తో పాటు, కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం రాజీవ్‌గాంధీ పార్కు వద్ద, గొల్లపూడి ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. బందరు రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ ఉదయం మారథాన్ నిర్వహించారు. ఉదయం 10 గంటల వరకూ రాకపోకలకు అనుమతించలేదు. దీంతో బందరు రోడ్డుకు ఇరువైపుల నివాసాలు ఉన్న వారు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సాయంత్రం కళాకారులతో కార్నివాల్ నిర్వహించడంతో మధ్యాహ్నం 4 గంటల నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్రాఫిక్‌ను డైవర్డ్ చేయడంతో ఆయా రోడ్లలో వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా మదర్‌థెరిస్సా విగ్రహం సమీపంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులు సైతం ట్రాఫిక్‌తో ఇబ్బంది పడ్డారు.
కూటమి నేతలు ఆర్భాటంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ నగర ప్రజలకు, ఉత్సవాలకు చాలా సమస్యలు సృష్టించింది. ప్రధానంగా ఆలయానికి సమీపంలో పున్నమి ఘాట్ వద్ద ఒక ప్రధాన వేదికను ఏర్పాటు చేయటంతో అటుగా భక్తుల రాకపోకలకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మంత్రులు ఇతర వీవీఐపీల రాకపోకలతో పోలీసులు గంటల తరబడి వాహనాలను మళ్లించటం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
ముఖ్యమంత్రి పర్యటనలతో...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంజీరోడ్డులో నిర్వహించిన కార్నివాల్‌తో పాటు, గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పాల్గొన్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో భవానీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కనకదుర్గమ్మ ఫ్‌లై ఓవర్ ప్రారంభం వద్ద భవానీలు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. బస్టాండ్ అవుట్‌గేట్ వరకూ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు చంద్రబాబు రాకతో, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో గొల్లపూడి వద్ద ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.