
చెత్త ఇస్తే సరుకులు ఇస్తాం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పొడి చెత్తను తీసుకొచ్చిన వారికి బదులుగా నిత్యవసర సరుకులు అందిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని కోనేరు సెంటర్‌లో మంత్రి రవీంద్ర కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గురువారం స్వచ్ఛ రథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథం వాహనాలను ప్రారంభించామన్నారు. వ్యర్థాలను సేకరించేందుకు కృష్ణాజిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏడు స్వచ్ఛ రథాలను కేటాయించామని తెలిపారు. వీటి ద్వారా ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు వంటి పొడి చెత్తను సేకరిస్తారన్నారు. పొడి చెత్తను సేకరించి అందించిన వారికి స్వచ్ఛ రథం వాహనం దగ్గర దానికి సమానమైన నిత్యావసర సరుకులు అందిస్తారన్నారు. చెత్తను తరలించేందుకు ఉన్న రెండు కంపాక్టర్లకు అదనంగా మరో కంపాక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందని, వీటి ద్వారా జిల్లాలోని చెత్తను ఎప్పటికప్పుడు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఏడు స్వచ్ఛ రథాలను ప్రారంభించామని, వీటి ద్వారా గ్రామాల్లో గృహాల వద్ద వృథాగా పేరుకుపోయిన ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు, అట్ట పెట్టెలు, గాజు సీసాలు తదితర పొడి చెత్తను సేకరించి స్వచ్ఛ రథం వద్ద అందిస్తే దానికి సమానమైన కందిపప్పు, మినప గుళ్లు, పేస్టు, షాంపూ, కొబ్బరి నూనె, సబ్బులు, పెన్నులు, ఉల్లిపాయలు తదితర నిత్యవసర వస్తువులను అందిస్తారన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందడంతో పాటు పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారి, జెడ్పీ డెప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోయ నాగమణి, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.