
అవనిగడ్డలో స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలి
అవనిగడ్డ: పాత ఎడ్లంకలో వరద ఉధృతికి ఇళ్లు కోల్పోయిన బాధితులకు అవనిగడ్డలో నివేశన స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్యెల్యే సింహాద్రి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. వరద ఉధృతికి ఇళ్లు పడిపోయిన ప్రాంతాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, ఇళ్లు కోల్పోయిన బాధితులు మాట్లాడుతూ గ్రామంలో తాము ఉండలేమని, తమకు అవనిగడ్డలో ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇళ్లు నిర్మించేలా చేస్తే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతామని మొర పెట్టుకున్నారు. వరద వల్ల తమ గ్రామం తీవ్రంగా కోతకు గురవుతోందని, ఎప్పుడు ఎవరి ఇల్లు నీటిలో మునిగిపోతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పారు. తమ గ్రామానికి రివిట్మెంట్ వద్దు ఇంకేమీ వద్దని, తమకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించేలా చూడాలని వేడుకున్నారు. అందుకు సింహాద్రి స్పందిస్తూ గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా రెండు సంవత్సరాల నుంచి ఎడ్లంక గ్రామం తీవ్రంగా కోతకు గురవుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు చింతలపూడి బాలభాస్కరరావు, గ్రామ కన్వీనర్ నలకుర్తి రమేష్, పార్టీ నాయకులు గరికపాటి కృష్ణారావు, కొండవీటి రాంప్రసాద్, అవనిగడ్డ రంగనాథ్, సైకం నాగరాజు, సైకం లంకేశ్వరరావు, మునిపల్లి ప్రభాకర్, ముసలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్యెల్యే సింహాద్రి రమేష్‌బాబు