
జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి
గుమ్మడిదుర్రు(పెనుగంచిప్రోలు): జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని గుమ్మడిదుర్రు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నరసింహశెట్టి పద్మావతి(37) గత నాలుగు రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతూ స్థానిక ఆర్‌ఎంపీల వద్ద చికిత్స పొందు తోంది. ప్లేట్‌లెట్స్ తగ్గి పరిస్థితి విషమించటంతో ఆదివారం నందిగామ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. మృతురాలి భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందగా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జ్వరాలు ప్రబల కుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.