
అనుమానాస్పద స్థితిలో అర్చకుడి మృతి
తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థాన అర్చకుడు దీవి వేణుగోపాలాచార్యులు(55) ఆదివారం రాత్రి అదృశ్యమై గ్రామ శివారులోని అనురాధ వాగులో సోమవారం మధ్యాహ్నం శవమై తేలారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వేణుగోపాలాచార్యులు ఆలయం మూసివేసిన తదుపరి ఇంటికి రాకపోవడంతో ఆయన ఆచూకీ కోసం గాలించారు. అనురాధ వాగు వంతెనపై ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, ఆలయ తాళంచెవులు ఉండటంతో గ్రామస్తులు వాగులో గాలించి ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన భార్య కరుణశ్రీ ఉపాధ్యాయినిగా పనిచేస్తుండగా, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గంపలగూడెం ఎస్‌ఐ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.