
కృష్ణమ్మ ఉగ్రరూపం
పులిచింతల నుంచి 7లక్షల క్యూసెక్కులు విడుదల జలదిగ్బంధంలో రావిరాల గ్రామం జగ్గయ్యపేట, ముక్త్యాలకు రాకపోకలు బంద్
రెండో ప్రమాద హెచ్చరిక..
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద నీటిని విడుదల చేయటంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రెండు రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండటంతో మండలంలోని నదీ పరివాహక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి 7లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల నుంచి విడుదల చేయటంతో నది పరీవాహక గ్రామామైన రావిరాల జలదిగ్బంధంలో చిక్కుకుంది.
చుట్టుముట్టిన వరద..
కృష్ణానది ఒడ్డున ఉన్న రావిరాల గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఆ ఒడ్డున ఉన్న గృహాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో నది ఒడ్డున నివాసం ఉంటున్న ప్రజలను పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చారు. ముక్త్యాల వద్ద కోటిలింగ హరిహర మహాక్షేత్రం సమీపంలోని చంద్రమ్మకయ్య ఉద్ధృతంగా ప్రవహించడంతో జగ్గయ్యపేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఆదివారం రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో బ్యారేజీకు 6,50,389క్యూసెక్కుల వరద వస్తుండగా ఇందులో 6,39,737 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలివేశారు. మిగిలిన 10,652 క్యూసెక్కులు పంట కాలువలకు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 15.9 అడుగులకు చేరుకుంది.

కృష్ణమ్మ ఉగ్రరూపం