
బీచ్‌లో గల్లంతైన వ్యక్తి – కాపాడిన పోలీసులు
కోనేరుసెంటర్: మంగినపూడి బీచ్‌లో ఓ వ్యక్తి గల్లంతు కాగా ప్రమాదాన్ని పసిగట్టిన పోలీసులు అతన్ని కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి గిలకలదిండి మైరెన్ ఎస్‌ఐ చంద్రబోస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన హర్‌ప్రీత్‌సింగ్ గన్నవరంలోని హెచ్‌పీఎల్ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం ఆంధ్ర వచ్చాడు. అతనితో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్న మరో ముగ్గురు స్నేహితులు విహారయాత్రకని బీచ్‌కు వచ్చారు. ఉదయం అంతా బీచ్‌లో స్నానాలు చేసిన స్నేహితులు మధ్యాహ్నం భోజనాలు చేసి మరలా స్నానానికి సముద్రంలోకి వెళ్లారు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా హర్‌ప్రీత్‌సింగ్ ఒక్కసారిగా అలల మధ్య చిక్కుకుపోయాడు. నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు గట్టిగా కేకలు వేస్తూ డ్యూటీలో ఉన్న పోలీసులను పిలిచారు. అదే సమయంలో విధుల్లో ఉన్న హోంగార్డు నాంచారయ్య, రూరల్ పీఎస్ కానిస్టేబుల్ హరికృష్ణ కలిసి హర్‌ప్రీత్‌సింగ్‌ను కాపాడేందుకు లైఫ్‌జాకెట్‌లు ధరించి సముద్రంలోకి పరుగులు పెట్టి ఎట్టకేలకు ప్రాణాలతో అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అనంతరం చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించినట్లు మైరెన్ ఎస్‌ఐ చంద్రబోస్ తెలిపారు. బాధితుడు క్షేమంగా ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.