
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
– కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం):పరిసరాలను శుభ్రంగా ఉంచటంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శనివారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో బందరు డివిజన్ పరిధిలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్టు, యూనిఫాంను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు. అలాంటి వారి సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వ్యర్ధాలను తొలగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణించిన, శాశ్వత వైకల్యాలకు గురైన వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు రూ.10 లక్షల విలువైన బీమా సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోయ నాగమణి, జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణ, అధికారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
ఈ–పంట నమోదు పూర్తి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం):జిల్లాలో ఈ–పంట నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్లో పలు అంశాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు పంటలు కోల్పోతే నష్టపరిహారం, పంట బీమా పొందేందుకు, ధాన్యం కొనుగోలు వంటి వాటికి ఈ–పంట నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆలస్యం లేకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్, తల్లికి వందనం పథకాల నగదు జమ కాని లబ్ధిదారుల సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. బ్యాంకు ఖాతాను తెరవటం, బ్యాంకు ఎకౌంట్‌కు ఆధార్ అనుసంధానం చేయటంపై లబ్ధిదారులకు వివరించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ అధికారులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి