
భూమిలో సారం లేకపోవడమే నష్టాలకు కారణం
మక్కపేట(వత్సవాయి):తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయంకు ప్రభుత్వాలు చేయూతనందించాలని గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎం.రవికిషోర్ తెలిపారు. గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫాం గుంటూరు సామాజిక విజ్ఞాన కళాశాల ఆధ్వర్యంలో గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంపై రైతు సదస్సు– వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానురాను వ్యవసాయం అనేది తీవ్ర సంక్షభంలోకి వెళ్తుందని చెప్పారు. వ్యవసాయంలో నష్టాలు రావడానికి ముఖ్య కారణం భూమిలో సారం లేకపోవడమేనని చెప్పారు. గతంలో వ్యవసాయంతో పాటు పాడి పుష్కలంగా ఉండేదని తెలిపారు. దీంతో పశువుల ఎరువును పొలాలకు తోలడం వల్ల భూమిలో సారం పెరిగి పెట్టుబడులు తగ్గడంతోపాటు దిగుబడులు పెరిగాయన్నారు. కానీ ప్రస్తుతం పల్లె ప్రాంతాల్లోనూ పాడి లేకపోవడం వల్ల పశువుల వ్యర్థాలను పొలాలకు చల్లే వారే లేకుండా పోయారని పేర్కొన్నారు. పైగా రసాయనిక ఎరువులు వాడడంవల్ల భూమి చౌడుబారిపోతుందని వెల్లడించారు. దీంతో ఎంత పెట్టుబడులు పెట్టినా దిగుబడులు లేకుండా పోయాయన్నారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. పంట వేయడానికి కనీసం 40 రోజులు మందుగా పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగులు, జనుము, పిల్లిపెసలు వంటివి చల్లుకుని దుక్కిలో కలియదున్నుకుంటే మంచిదని స్పష్టం చేశారు. వైరస్‌లు రాకుండా ఉండడానికి వేపనూనెను పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. అనంతరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన వ్యవసాయ ప్రదర్శన తిలకించారు. కార్యక్రమంలో గృహవిజ్ఞాన శాస్త్రవేత్త ఆర్.ప్రభావతి, సర్పంచ్ మల్లెల శివప్రసాద్, సొసైటీ అధ్యక్షులు సత్తి బేతోలు, కట్టా కోటయ్య,దశరథరామారావు, శర్మ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎం.రవికిషోర్