
బందరులో శక్తిపటాల సందడి దసరా ఉత్సవాల్లో ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్న వైనం
మచిలీపట్నంటౌన్: దసరా ఉత్సవాల సందర్భంగా కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శతాబ్దకాలంగా ఓ అరుదైన ఆచారం కొనసాగుతోంది. ఇప్పటికీ బందరువాసులు భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తుండటం గమనార్హం. ఆ ఆచారాన్ని పాటిస్తే తమకు సకలశుభాలు కలుగుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం.
శక్తిపటాల ఊరేగింపునకు ప్రసిద్ధి..
మచిలీపట్నం దసరా శక్తిపటాల ఊరేగింపునకు పెట్టింది పేరు. విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల తర్వాత అంత పెద్దఎత్తున దసరా వేడుకలు బందరులోనే నిర్వహిస్తారు. శక్తిపటాల ఊరేగింపు విషయానికి వస్తే కోల్‌కతా తర్వాత అంతస్థాయిలో నిర్వహించేది కూడా మచిలీపట్నంలోనే. ఈ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు దాదాసింగ్ దశాబ్దాల క్రితం కోల్‌కతాలోని కాళీకామాత చిత్రపటాన్ని నగరంలోని ఈడేపల్లి సెంటర్‌లో ప్రతిష్ఠించి పూజలు చేశారు. చిన్న తాటాకుల పందిరి కింద ఏర్పాటు చేసిన కాళికామాత గుడి, నేడు దేవాలయంగా రూపాంతరం చెందింది. నాటి నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతోంది. శక్తిపటాల ప్రదర్శనను మచిలీపట్నానికి పరిచయం చేసింది ఆయనే.
పండుగ రోజుల్లో మనిషికి శక్తివేషం వేసి వెదురు కర్రలతో తయారుచేసిన దుర్గామాత శక్తి పటానికి కాగితాలు అంటించి దుర్గామాత బొమ్మవేసి రంగులు అద్ది, అతని వీపునకు కడతారు. శక్తిపటాన్ని కట్టుకున్న వ్యక్తి పురవీధుల్లో ఊరేగుతుండగా డప్పులు, తీన్మార్ వాయిద్యాల మోతల నడుమ నృత్యం చేస్తూ భక్తులు అతనిని అనుసరిస్తుంటారు. శక్తిపటం కట్టుకున్న వ్యక్తిని దుర్గామాత ఆవహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలా ఊరేగుతున్న శక్తిపటాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. నల్లని దుస్తులతో ఒక చేతిలో చురకత్తి, రెండో చేతిలో ఆరడగుల శక్తిపటాన్ని భుజానకెత్తుకుని నిర్వహించే ప్రదర్శన భక్తిభావాలను చాటుతుంది. ముందువైపు కాళీకామాత, వెనుక ఆంజనేయస్వామి చిత్రాలతో రూపొందించిన పటం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. దసరా సందర్భంగా పలువురు పెద్దపులి, ఇతర వేషధారణలతో నగరంలో సంచరిస్తూ దసరా ఉత్సవానికి మరింత శోభను తెస్తుంటారు.
సకుటుంబ సపరివారంగా వీక్షణం..
గతంలో మచిలీపట్నంలోని శక్తిగుడి, గొడుగుపేట గాయత్రీమాత ఆలయం ఆధ్వర్యంలో ఈ శక్తి పటాల ప్రదర్శనలు జరిగేవి. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు శక్తిపటాలు ఎత్తుకుంటున్నారు. రుద్రభూమిలో తెల్లవారుజామున పూజలు చేసి శక్తిపటాన్ని ఎత్తుకునే వ్యక్తి ఉపవాస దీక్షను స్వీకరిస్తారు. చిన్నాపెద్దా తేడాలేకుండా వారి స్ధాయిని బట్టి శక్తిపటాలను తయారు చేసి ప్రస్తుతం నగరంలో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు స్ధానికులతోపాటు వారి బంధువులు, భక్తులు అధికసంఖ్యలో నగరానికి తరలివస్తుంటారు.
కోనేరు సెంటర్‌లో ప్రత్యేక ప్రదర్శన..
శక్తి పటాన్ని ఎత్తుకునే వ్యక్తులు ముఖానికి కాళీకామాత ముఖచిత్రాన్ని కరాళంగా ధరిస్తారు. ఉదయం ఉపవాస దీక్షతో మొదలయ్యే ప్రదర్శన సాయంత్రం వరకూ కొనసాగుతుంది. శక్తిపటాన్ని ధరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. మచిలీపట్నంలోని పలు దేవాలయాల్లో శక్తిపటాలను ఉంచి పూజలు చేస్తారు. విజయదశమి (దసరా)నాటి రాత్రి ఆయా ప్రాంతాల నుంచి శక్తిపటాలు ఊరేగింపుగా బయలుదేరి తెల్లవారుజాము సమయానికి ప్రధానకూడలి కోనేరు సెంటర్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని శక్తి పటాలు కోనేరుసెంటరుకు చేరిన దృశ్యాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలిస్తుండటంతో ఆ ప్రాంతమంతా కోలహలంగా మారుతుంది. శక్తిపటాలు కోనేరు సెంటర్‌కు చేరుకోవడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.

కోల్‌కతా టు మచిలీపట్నం