కొండ రాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా
పామర్రు:విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిలో స్థానిక జాలయ్య మిల్లు వద్ద కొండరాళ్లతో వెళ్తున్న లారీ జోరు వానలో బోల్తా పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు కొండ రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ స్థానిక జాలయ్య మిల్లు వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న వర్షపు నీటిని తప్పింబోయి రోడ్డు మధ్యలోకి వచ్చింది. ఈ క్రమంలో కారును తప్పించబోయి లారీని ఎడమవైపునకు తిప్పడంతో లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న పెద్ద పెద్ద కొండరాళ్లు అన్ని చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో ఎక్కువగా వాహనాలు రాకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని జోరు వానలో సైతం కొండ రాళ్లను డోజర్‌తో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ తన సిబ్బందితో క్లియర్ చేయించారు. బోల్తా పడిన లారీని క్రేన్ సహాయంతో రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ సంఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చల్లపల్లి:మండల పరిధిలోని మాజేరులో పుట్టకు వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యకి మృతదేహం లభ్యమైన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం బాడీని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ పీఎస్‌వీ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడు బంధువులు గురువారం వచ్చి మృతి చెందిన వ్యక్తిని గుర్తించారు. ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామానికి చెందిన గుబిలి సుబ్రహ్మణ్యం అని ఇంటి పట్టున ఉండకుండా తరచూ ఊర్లు తిరుగుతాడని తెలుపగా పోస్టుమార్టం అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
పామర్రు:పామర్రు–చల్లపల్లి రహదారిలో రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పామర్రు గ్రామ శివారు శ్యామలాపురానికి చెందిన తలగల ప్రసాద్ (43) మోటార్ సైకిల్‌పై బయలు దేరి వస్తుండగా, ఎదురుగా వస్తున్న మరొక బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తికి గాయాలవ్వడంతో వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
తప్పిన ఘోర ప్రమాదం
తప్పిన ఘోర ప్రమాదం