
పరిసరాల శుభ్రతలో భాగస్వామ్యం
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కోనేరుసెంటర్: ప్రజలంతా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ గ్రామాలు, పట్టణాల్లో జరిగే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా గురువారం మచిలీపట్నం మండలంలోని ఎస్.ఎన్.గొల్లపాలెంతో పాటు గూడూరులో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ గొల్లపాలెంలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. గ్రామ చెరువు దగ్గర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్, అధికారులు, సిబ్బంది గ్రామస్తులతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో జిల్లాలోని చెత్తకుప్పలను తొలగించి పరిశుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆ ప్రాంతాల్లో చెత్త వేయకుండా గ్రామస్తులందరికీ అవగాహన కల్పించడంతో పాటు పర్యవేక్షణ ఉంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 300 వరకు చెత్తకుప్పలను గుర్తించామని వచ్చే అక్టోబర్ 2వ తేదీ నాటికి వీటన్నిటిని పరిశుభ్రం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం ఆయన గూడూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో చెత్త తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కుంచె నాని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలం నాగమణి, డివిజనల్ పంచాయతీ అధికారి రజావుల్లా, ఎంపీడీవో వెంకటేష్, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.