అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
సర్వదర్శనానికి మూడున్నర గంటల సమయం
మధ్యాహ్నం నుంచి ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ జామ్
సాయంత్రం 6 గంటల సమయానికి 70 వేల మందికి దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువైన ఇంద్రకీలాద్రికి గురువారం భక్తులు పోటెత్తారు. కాత్యాయనీదేవిగా కరు ణించిన జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పిల్లాపాపలతో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లతోపాటు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకారం, పూజలు, నివేదన అనంతరం భక్తులను దర్శనా నికి అనుమతించారు. పదేళ్ల తర్వాత దుర్గమ్మను కాత్యాయనీదేవిగా అలంకరించడంతో అమ్మను దర్శించుకోవాలనే తపనతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అన్ని క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. సర్వ దర్శనానికి మూడు నుంచి మూడున్నర గంటల సమయం పట్టింది. రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులతో పాటు ఉచిత దర్శనానికి విచ్చేసిన వారిని సైతం ఒకే క్యూలైన్‌లోకి అనుమతిఇస్తున్నారని, దీంతో తమకు మరింత ఆలస్యం అవుతుందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండ దిగువన టోల్‌గేట్ వద్ద భక్తులు గుంపులు గుంపు లుగా చేరి క్యూలైన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
వీఐపీ టైం స్లాట్ మార్పులతో గందరగోళం
ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు నిర్ణయించిన వీఐపీ టైం స్లాట్‌లో మార్పులు చేస్తున్నట్లు బుధవారం రాత్రి ఆలయ అధికారులు అకస్మాత్తుగా ప్రకటించారు. ఉదయం ఐదు నుంచి ఆరు, మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు, రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు వీఐపీలకు కేటాయించారు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రముఖులు, వీఐపీలు ఈ మార్పులు తెలియక గురువారం ఉదయం ఏడు గంటలకు ఆలయానికి చేరుకున్నారు. సమయం ముగిసిందని వారిని దర్శనానికి అనుమతించకపోవడంతో గందరగోళం నెలకుంది. మరో వైపు సేవా బృందం సభ్యురాలైన బొడ్డు నాగలక్ష్మి వీఐపీ గేట్ వద్ద బైఠాయించారు. తమ బంధువులను దర్శనానికి తీసుకెళ్తూ తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఘాట్‌రోడ్డుపై ట్రాఫిక్ జామ్
మధ్యాహ్నం మూడు గంటల నుంచి వీఐపీ టైం స్లాట్ ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అమ్మవారి దర్శనానికి సొంత వాహనాల్లో కొండపైకి చేరుకునేందుకు బారులు తీరారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా ఉత్సవాల్లో ఘాట్‌రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓం టర్నింగ్ నుంచి కొండ దిగువన గాలిగోపురం వరకు కార్లు, ఇతర వాహనాలు బారులు తీరాయి. దిగువన గాలి గోపురం నుంచి హెడ్ వాటర్ వర్కు వరకు, హెడ్ వాటర్ వర్క్స్ నుంచి దుర్గాఘాట్ వరకు కార్లు, ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. కొన్ని వాహనాలకు ఒక సారి వినియోగించేలా పాస్‌లు జారీ చేయగా, అవి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండపైకి, కిందకు తిరుగుతూ అనధికార వీఐపీలను చేరవేస్తున్నాయని దేవస్థాన సిబ్బందే బహిరంగంగా పేర్కొంటున్నారు.
మహామండపం లిఫ్టు, మెట్ల మార్గాలకు తాళాలు
అమ్మవారి ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరగడంతో కొండపైకి చేరుకునే మార్గాలను పోలీసులు మూసివేశారు. మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గాలకు తాళాలు వేయడంతో ఆలయంలో మధ్యాహ్నం నుంచి విధులకు హాజరు కావాల్సిన వారు గేట్ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. మరో వైపు కుమ్మరిపాలెం సెంటర్‌లో డ్యూటీ పాస్‌లు ఉన్న ఆలయ సిబ్బందిని, మేళం సిబ్బందిని దుర్గగుడి వైపు అనుమతించలేదు. పాస్‌లు ఉన్నా సరే కొండ చుట్టూ తిరిగి వెళ్లాలని పోలీసులు స్పష్టం చేయడంతో వారు ఇబ్బందిపడ్డారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
సర్వ దర్శనం క్యూలైన్‌లో కలెక్టర్, ఎంపీ
కాత్యాయనీదేవి అలంకారంలో దుర్గమ్మను పలువురు గురువారం దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి సర్వ దర్శనం క్యూలైన్‌లో నడిచి ఆలయానికి విచ్చేశారు. మార్గమధ్యలో క్యూలైన్‌లో వస్తున్న భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆలయానికి వచ్చేసరికి వీఐపీ టైం స్లాట్ ముగియడంతో బంగారు వాకిలి ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. ఆయన గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
ఆది దంపతుల నగరోత్సవం
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిదంపతుల నగరోత్సవం వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన పల్లకీపై శ్రీ గంగాపార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారు అధిరోహించారు. ఆది దంపతులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్ కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల కోలాట నృత్యాలతో ఆది దంపతుల ఊరే గింపు ఇంద్రకీలాద్రి పరిసరాల్లో సాగింది.
దుర్గగుడిపై నేడు
శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి అమ్మవారి దర్శనం
ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక ఖడ్గమాలార్చన
ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక కుంకుమార్చన
ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్రనవార్చన
సాయంత్రం 5 గంటలకు శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం
సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి
రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం

సర్వ దర్శనం క్యూలైన్

మహిళల కోలాటం

నగరోత్సవంలో వాద్యకళాకారులు