
మృతదేహంతో ఎస్టీల నిరసన
పెడన మండలం నందిగామలో విషాదం పూడ్చేందుకు స్థలం లేక గంటల కొద్దీ నిరీక్షణ ఒక రైతు ముందుకు రావడంతో తాత్కాలికంగా తీరిన సమస్య
పెడన: చనిపోయినా ఆరడుగుల స్థలం దొరక్క రాష్ట్రంలో ఇప్పటికీ షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఎదుర్కొంటున్న సమస్యకు ఈ ఘటన అద్దం పడుతోంది. పెడన మండలం నందిగామ గ్రామంలో ఎస్టీ యానాదులకు చెందిన ఈగ రాంబాబు (76) ఆదివారం ఉదయం చనిపోయారు. రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. అయితే గ్రామంలో ఉన్న ఏడు శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడానికి ఆయా సామాజిక వర్గాలల వారు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక మృతదేహంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన చేపట్టారు. ఆధార్ సహా తగిన గుర్తింపు కార్డులు ఉన్నా, తమ సమస్యలను పరిష్కరించే నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏకసిరి వెంకటేశ్వరరావు సహా పలువురు సంఘ నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఎం.ఫణిధూర్జటి, పెడన ఇన్‌చార్జ్ తహసీల్దారు కె.అనిల్‌కుమార్, ఎంపీడీఓ ఎ.అరుణకుమారి హుటాహుటిన నందిగామకు చేరుకుని శ్మశానాలను, ఖాళీ స్థలాలను పరిశీలించినా ఫలితం కనబడలేదు. అయితే చివరకు రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి స్థలం ఇచ్చేందుకు పెద్ద మనసుతో ఒక రైతు ముందుకు రావడంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారమైంది.
కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం శూన్యం
ఇటీవల శ్మశానం కోసం స్థలం కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని ఈగ రాంబాబు కుటుంబసభ్యులు సహా పలువురు తెలిపారు. అయినా ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎస్టీలు తమ ఆందోళనను విరమించారు.