
ఆశలు.. కన్నీటి పాలు!
అరటి రైతులను ఆదుకోవాలి..
అరటి రైతులకు అపార నష్టం
ఈదురుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట
కోతకు సిద్ధంగా ఉన్న అరటి గెలలు నేలమట్టం
భారీగా నష్టపోయిన రైతులు
ప్రాథమిక అంచనాల నమోదులో అధికారులు
కంకిపాడు: సీజన్ ఏదైనా రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు చితికిపోతున్నారు. తాజాగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అరటి రైతులకు అపార నష్టం మిగిల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలమట్టం కావటంతో అన్నదాతలు భారీగా నష్టపోయారు. ప్రాథమికంగా పంట నష్టం నమోదు అంచనాల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.
వెన్నువిరిగిన అరటి రైతు..
కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో అరటి సాగు జరుగుతోంది. ప్రధానంగా కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు లంక గ్రామా లు, కరకట్ట వెంబడి గ్రామాల్లో అరటి సాగవుతోంది. కూర అరటి, తినే అరటి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట గెలల మీద ఉంది. అదును రాగానే గెలలు కోసి మార్కెట్‌కు తరలించేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులతో కూడి న భారీ వర్షం కురిసింది. దీని ప్రభావంతో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. చేతికొచ్చిన పంట నేలవాలి గెలలు దెబ్బతినటంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.
ప్రాథమిక అంచనాల్లో అధికారులు..
అరటి పంట దెబ్బతినటంతో జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పంట నష్టం వివరాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. కోత దశలో ఉన్న పంట దెబ్బతినటంతో తమను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కోలుకోని దెబ్బతో విలవిల..
వరుసగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోయారు. నష్టాన్ని అధిగమించి, తిరిగి సాగు చేపట్టిన రైతులకు వరుసగా ముంచుకొస్తున్న విపత్తులతో నష్టం జరుగుతోంది. మే నెలలో అకాల వర్షానికి కృష్ణాజిల్లాలో వివిధ రకాల పంటలు 92.40హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 127 మంది రైతులకు నష్టం వాటిల్లింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి అరటి తోటలకు నష్టం జరిగింది. అధికారులు మొక్కుబడిగా పంట నష్టం వివరాలను నమోదు చేయకుండా పూర్తి స్థాయిలో పంట నష్టం నమోదు చేసి తమను ఆదుకోవాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతుంది.
80 సెంట్ల విస్తీర్ణంలో అరటి తోట సాగు చేస్తున్నా. మొన్న కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన అరటి చెట్లు విరిగిపోయాయి. భారీగా నష్టం వాటిల్లింది. పంట నష్టం నమోదు చేపట్టి నష్టపోయిన అరటి రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. పరిహారం అందించి భరోసా కల్పించాలి.
– తిమ్మారెడ్డి, రైతు, ప్రొద్దుటూరు
అంచనాలు నమోదు చేస్తున్నాం..
భారీ వర్షం, ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. కోత దశలో పంటకు నష్టం జరిగింది. అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను ప్రాథమికంగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి సమర్థంగా నివేదిస్తాం.
– జె.జ్యోతి, ఉద్యానశాఖ అధికారి,
కృష్ణాజిల్లా