గన్నవరం: మండలంలోని కేసరపల్లి వద్ద చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నేపాల్ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి (35) కేసరపల్లిలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఫ్లై ఓవర్ దాటిన తర్వాత రోడ్డు దాటుతున్న అతడిని విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.