
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
పమిడిముక్కల: ఆ దంపతుల అన్యోన్యతను చూసి విధికి కన్నుకుంట్టిందో ఏమో రోడ్డు ప్రమాదం రూపంలో వారిని విడదీసింది. భార్యను బలితీసు కుని భర్తకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమదం విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై పమిడిముక్కల మండలంలోని తాడంకి గ్రామం వద్ద బుధవారం జరిగింది. మచిలీపట్నం మండలం మేకవానిపాలెం పంచాయతీ పరిధిలోని సీతయ్యనగర్‌కు చెందిన వీరంకి నాగమల్లేశ్వరరావు, నాగలక్ష్మి(42) దంపతులు. వారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహ మైంది. రెండో కుమార్తె బ్యాంక్ ఉద్యోగం చేస్తుండగా, మూడో కుమార్తె చదువుకుంటోంది. నాగమల్లేశ్వరరావుకు లారీ ఉంది. లారీకి అవసరమైన టైర్లు కొనుగోలు చేసేందుకు అతను భార్య నాగలక్ష్మితో కలిసి బైక్‌పై విజయవాడ బయలు దేరారు. తాడంకి సమీపంలో ఎదురుగా వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఒక్కసారిగా కుడి వైపునకు తిరిగింది. దీంతో ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో నాగమల్లేశ్వరరావు దంపతులు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పింది. బైక్ వెనుక కూర్చున్న నాగలక్ష్మి రోడ్డుపై పడిపోయింది. ఆమె తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే భార్య మృతిచెందడంతో నాగమల్లేశ్వరరావు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ బి.శ్రీను ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. నాగలక్ష్మి మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పేర్ని కిట్టు సందర్శించి నివాళులర్పించారు. నాగమల్లేశ్వరరావును పరామర్శించారు.