
లెక్కలేనితనం!
●
జి.కొండూరు: పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనిక వ్యర్థాలను కనీస మానవత్వం మరిచి పంట కాలువల్లో, చెరువుల్లో విడుదల చేస్తున్న ఘటనలు ఇటీవల ఎన్నో జరిగాయి. ఈ సమస్యపై ‘సాక్షి’ వరుస కథనాలను సైతం ప్రచురించింది. స్పందించిన పోలీసులు వ్యర్థాలను పారబోస్తున్న సెప్టిక్ ట్యాంకును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఏ కంపెనీ నుంచి వ్యర్థాలు తీసుకొచ్చి పారబోస్తున్నారో కూడా వాహన యజమాని ఒప్పుకున్నాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నమూనాలను తీసుకెళ్లారు. ఇరవై రోజులు గడిచినా నమూనాల ఫలితాలు పోలీసులకు చేరలేదు. ఎటువంటి రిపోర్టు రాకపోవడంతో జామీన్ తీసుకొని సెప్టిక్ ట్యాంకును పోలీసులు వదిలేశారు. మరలా వ్యర్థాల విడుదల మొదలైంది. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు గ్రామ శివారులోని పంట కాలువలో మరలా రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే పరిశ్రమలకు వరంలా మారింది. దశాబ్దాలుగా ఉన్న వ్యర్థాల సమస్యను మేనేజ్ చేస్తూ వస్తున్న స్థానిక ఐడీఏలోని పరిశ్రమలు, తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
కొత్త కొత్త మార్గాలలో..
కొండపల్లి ఐడీఏలోని పరిశ్రమలు రసాయనిక విడుదలలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షం పడినప్పుడు తొమ్మండ్రవాగులోకి విడుదల చేస్తున్నారు. లేదంటే సెప్టిక్ ట్యాంకుల ద్వారా శివారు గ్రామాల్లో పంట కాల్వలు, చెరువులలో పారబోస్తున్నారు. వీటిపై వివాదం తలెత్తినప్పుడు కంపెనీల్లోనే మండించి ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నారు. ఇలా ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నారని సమీప గ్రామమైన కట్టబడిపాలెం గ్రామ ప్రజలు ఇటీవల నిరసన తెలపడంతో మరలా పంట కాల్వల్లో పారబోయడం ప్రారంభించారు. మొదట వ్యర్థాలను కాలువల్లో, చెరువుల్లో పారబోసేది తాము కాదని కొండపల్లి ఐడీఏలోని పరిశ్రమల యజమానులు బుకాయించినప్పటికీ సెప్టిక్ ట్యాంకు పట్టుబడటంతో చేసేదిలేక దొరికిన దొంగల్లా కొన్ని రోజులు సైలెంటుగా ఉండిపోయారు. మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు.
పంట కాలువల్లో ఆగని కెమికల్ వ్యర్థాల డంపింగ్
హెచ్.ముత్యాలంపాడు గ్రామ శివారులోని ప్రధాన కాల్వలో ప్రస్తుతం రసాయనిక వ్యర్థాలను విడుదల చేయడం వల్ల నీటి ప్రవాహానికి ఈ వ్యర్థాలు సమీపంలోని వరిపైరులోకి చేరుతున్నాయి. ఈ క్రమంలో వరిపైరు రంగుమారి పాడైపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వ్యర్థాలు కలిసిన నీటిలో దిగి కలుపుతీత, ఎరువులు చల్లడం, మందు పిచికారీ వంటి పనులు చేస్తే ఎలర్జీల బారిన పడతామని రైతులు వాపోతున్నారు.
వరి పైరులోకి వ్యర్థాలు..

లెక్కలేనితనం!