
అర్జీలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
డీఆర్వో చంద్రశేఖరరావు
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మీ కోసం’లో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులకు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె. స్వాతి, హౌసింగ్ ఇన్‌చార్జ్ పీడీ పోతురాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
నిర్లక్ష్యం వద్దు..
అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయానికి పరిష్కరించాలన్నారు. ఐ గాట్ కర్మ యోగి ఆన్‌లైన్ కోర్సులను పూర్తి చేయటంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అవసరమైతే దానికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మొత్తం 133 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
●ప్రభుత్వం తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా ప్రతినిధి లింగం రవికిరణ్, నల్లమోతు ఆంజనేయులు విన్నవించారు. అప్పులు తెచ్చి తాము అధికారులు చెప్పిన విధంగా నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తున్నా ఏళ్ల తరబడి బిల్లులు రావడం లేదన్నారు. అధికారులు దీనిపై దృష్టిసారించి వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు.
●కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, పుప్పాల నరసింహారావు అర్జీ ఇచ్చారు. అమెరికా 50 శాతానికి పైగా సుంకాలు విధించటం వల్ల రైతులు టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 50 వేల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని చర్యలు తీసుకోవాలని కోరారు.