
దద్దరిల్లిన ధర్నా చౌక్
మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు, వీఆర్‌ఏలు రోడ్డెక్కారు. బందరులోని కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏలు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్‌ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించలేదన్నారు. వీఆర్‌ఏలకు ప్రస్తుతం గౌరవ వేతనం కేవలం రూ. 11వేలు మాత్రమే అందుతోందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా ఆరేళ్లుగా జీతభత్యాలు పెరగకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వీఆర్‌ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం, కార్యదర్శి చాట్లు రమేష్, ఉపాధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు, జ్యోతి, కె. మహేష్, పి. వీర వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల ధర్నా..
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికుల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద నున్న ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. గెలవకముందు విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. జీపీఎఫ్ పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ బి. శ్రీనివాసరావు, కన్వీనర్ వి. అంకబాబు, ఎల్. రామ్మోహన్‌రావు, పి. డేవిడ్ రాజు, ఎ. రాంబాబు, ఎస్. శ్రీనివాసరావు, డి. నాగరాజు, రామోజీ, లైన్మెన్ జొన్నలగడ్డ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు, వీఆర్‌ఏల ధర్నా

దద్దరిల్లిన ధర్నా చౌక్