
వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి అభివృద్ధిని వికేంద్రీకరించాలని జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయనగరంలో జరిగిన జేవీవీ 18వ రాష్ట్ర మహాసభలలో చేసిన తీర్మానాలపై ఆదివారం రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విజయనగరంలో ఉన్న మహాకవి గురజాడ అప్పారావు గృహాన్ని పరిరక్షించి స్మారక కేంద్రంగా మార్చాలని, ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, ఆయన పేరుతో విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్ట పరచి టీచింగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని తీర్మానం చేశామన్నారు. జేవీవీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దార్ల బుజ్జిబాబు, రాజశేఖర్, గౌరు నాయుడు, శోభన్ కుమార్, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
లక్ష్మణరావు