
బాలుతో ప్రయాణం మధుర జ్ఞాపకం
విజయవాడ కల్చరల్: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో ప్రయాణం తన జీవిత గతినే మార్చిందని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. రాగలహరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ఆశీష్ స్టూడియోలో ఆదివారం సినీ నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు బాల సుబ్రహ్మణ్యం సంస్మరణసభ, సినీ సంగీత విభావరి, సినీ, టీవీ నటుడు శుభలేకసుధాకర్‌కు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శుభలేక సుధాకర్ మాట్లాడుతూ బాలుతో ప్రయాణం ఓ మధురజ్ఞాపకం అని చెప్పారు. ఆయన వద్దే క్రమశిక్షణ, నిజాయతీ నేర్చుకున్నానని తెలిపారు. బాలు పేరుతో పురస్కారం అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని విషయం అన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు మల్లాది స్వాతి మాట్లాడుతూ బాలు మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు అన్నారు. గాయని కామేశ్వరి, న్యాయవాది ముష్టి శ్రీనివాస్, మీరాకుమార్, చింతకాయల చిట్టిబాబు పాల్గొన్నారు. నిర్వాహకులు శుభలేక సుధాకర్‌ను సత్కరించారు. అయ్యప్పన్ ఆధ్వర్యంలో గాయనీ గాయకులు పలు చిత్ర గీతాలను ఆలపించారు.