
‘ఆహార ఉత్పత్తులపై బహుళ జాతి కంపెనీల కన్ను’
కూసుమంచి: దేశ వ్యవసాయ రంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెత్తననం చెలాయిస్తుండగా, ఆ దేశానికి ప్రధాని మోదీ మోకరిల్లుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. కూసుమంచిలో సోమవారం నిర్వహించిన సంఘం పాలేరు డివిజన్ మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో పండించే ఆహార ఉత్పత్తులపై బహుళజాతి కంపెనీల కన్ను పడిందని పేర్కొన్నారు. దీంతో కార్పొరేట్ శక్తులను అడ్డుపెట్టుకుని వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈక్రమాన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఉద్యమాలు, పోరాటాల ద్వారా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని సుదర్శన్ పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం పాలేరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా బిక్కసాని గంగాధర్, గుడవర్తి నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా అద్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, నాయకులు రమణారెడ్డి, నర్సింహారావు, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సన్మంతరావు, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, అశోక్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.