
ఈ ప్రయాణం ప్రహసనమే..
● దసరా సెలవులు ముగియడంతో తిరుగుముఖం ● బస్టాండ్లల్లో ఒకేసారి ప్రయాణికుల రద్దీ ● ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా తీరని ఇక్కట్లు
ఖమ్మంమయూరిసెంటర్: దసరా పండుగ అనంతరం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులతో జిల్లాలోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం రీజియన్ ఆధ్వర్యాన దసరా సెలవులకు వచ్చివెళ్లే వారి కోసం వందల సంఖ్యలో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అయినా రద్దీకి ఏ సరి పోవడం లేదు. సెలవులు ముగియడం, సోమవా రం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండడంతో ఆదివారం జనమంతా ఒకేసారి తిరుగుముఖం పట్టారు. హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఇతర నగరాలకు వెళ్తుండగా రిజర్వేషన్ లేని వారు బస్సు ఎక్కేందుకు నానా పాట్లు పడుతున్నారు.
సరిపోని ప్రత్యేక బస్సులు
ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు గతంతో పోలిస్తే ఈసారి అదనంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యాన రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి ఆదివారం మొత్తం 400 బస్సుల్లో 250 బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడిపారు. వీటిలో 100 బస్సులకు రిజర్వేషన్ ఉంది. మరో 150 బస్సులు నాన్ రిజర్వేషన్ సర్వీసుల కింద నడపగా బస్సులు ఎక్కేందుకు జనం నానా తంటాలు పడ్డారు.
ఇసుకేస్తే రాలనంత..
రీజియన్ పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు బస్టాండ్లు ఆదివారం ప్రయాణికులతో కిటకిటలా డాయి. పండుగ కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి వచ్చిన జనం సెలవులు ముగియడంతో మళ్లీ తిరిగి వెళ్లేందుకు బస్టాండ్లకు చేరుకున్నారు. సుదూర ప్రాంతాలను మినహాయిస్తే హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడం.. రిజర్వేషన్ దొరకని వారు నేరుగా రావడంతో బస్సుల్లో సీట్లు దొరకడం గగనమైపోయింది.
అక్కడే ఫుల్..
రెగ్యులర్‌గా హైదరాబాద్ వెళ్లే లహరి, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ముందుగానే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ బస్సుల ప్రారంభ స్థానంలోనే నిండిపోతుండగా.. తర్వాతి బస్టాండ్లల్లో ప్రయాణికులు ఎక్కడానికి వీలు లేకుండా పోయింది. మిగిలిన ప్రయాణికులకు స్పెషల్ బస్సులే అందుబాటులో ఉండడం.. ఇందులో సీట్లు దొరకక కొందరు బస్టాండ్ల బయట ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
పర్యవేక్షిస్తున్న అధికారులు
తిరుగు పయనమైన వారితో బస్టాండ్లు కిటకిట లాడుతుండగా ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ అన్ని డిపోల మేనేజర్లను అప్రమత్తం చేశారు. ఆర్‌ఎం, డిప్యూటీ ఆర్‌ఎం, ఖమ్మం డిపో మేనేజర్‌లు ఖమ్మం కొత్త బస్టాండ్‌లో ప్రత్యేక బస్సులు, ఇతర డిపోల నుండి వచ్చిన బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. సిబ్బందికి సూచనలు చేస్తూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు సమకూర్చారు. ఇక వేలాది మంది ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతుండగా అవాంచనీయ ఘటనలు, చోరీలు జరగకుండా ఆర్టీసీ భద్రతా అధికారులు సిబ్బందితో 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. అటు పోలీస్ అధికారులు కూడా గస్తీ తిరుగుతున్నారు.
ఫుట్‌బోర్డుపైనే ప్రయాణం
కల్లూరురూరల్/తల్లాడ: దసరా పండుగ కోసం సొంత గ్రామాలకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్తుండడంతో ఆదివారం బసాండ్లలోరద్దీ ఏర్పడింది. సరిపడా బస్సులు లేకపోవడం సమస్యకు కారణమైంది. అరకొరగానే బస్సులు వస్తుండడంతో ప్రమాదమని తెలిసినా త్వరగా వెళ్లాలనే భావనతో పలువురు ఫుట్‌బోర్డులపైనే నిలుచుని ప్రయాణించడం కనిపించింది.

ఈ ప్రయాణం ప్రహసనమే..

ఈ ప్రయాణం ప్రహసనమే..