
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
మధిర: మధిర పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఏపీలోని ఎన్టీఆర్‌జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడుకు చెందిన ఇలవరపు వంశీ (21) తన స్నేహితులతో కలిసి ఆది వారం మధిర పెద్దచెరువులో ఈతకు వెళ్లాడు. పూర్తిస్థాయిలో ఈతరాని ఆయన వంశీ ప్యాంట్‌తో పాటే చెరువులోకి దిగాక కాసేపటికి ఆయాసంతో ఒడ్డుకు చేరలేకపోయాడు. ఈ సమయాన నీటిలో మునుగుతున్న ఆయనను కాపాడేందుకు స్నేహితులు యత్నించినా ఫలితం కానరాలేదు. సమాచారం అందుకున్న స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు నాలుగుగంటల పాటు శ్రమించి అతని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే, గాలింపు కొనసాగినంత సేపు వంశీ ప్రాణాలతో బయటకు వస్తాడని ఎదురుచూసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఆయన సంజీవరావు – మరియమ్మ దంపతుల్లో నలుగురి సంతానంలో వంశీ ఒక్కడే కుమారుడు కాగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుతున్న ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
పాముకాటుతో కూలీ..
నేలకొండపల్లి: పత్తి చేనులో పనిచేస్తున్నమహిళను పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన జె.రాధ నేలకొండపల్లి మండలం అనాసాగారంలో పనికి ఆదివారం వచ్చింది. పొలంలో పత్తి తీస్తుండగా పాము కాటేయడంతో మిగతా కూలీలు నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
చికిత్స పొందుతున్న మహిళ..
రఘునాథపాలెం: గడ్డి మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. రఘునాథపాలెం మండలం బద్యాతండాకు చెందిన గుగులోతు పద్మ(30) తల్లితో కలిసి నివసిస్తోంది. ఈక్రమాన పద్మ ప్రవర్తన నచ్చక తల్లి మందలించడంతో ఈనెల 3న ఆమె గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఘటనపై పద్మ తల్లి పిటోరి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.