
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: కట్లేరులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. మండలంలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన సగ్గుర్తి వెంకటరత్నం(57) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తాడు. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలో కట్లేరులో చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలో నీట మునిగి మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
రూ.7 లక్షల విలువైన బాణసంచా పట్టివేత
ఖమ్మంక్రైం: నగరంలోని వన్‌టౌన్ పరిధిలో రూ.7 లక్షల విలువైన టపాసులను అక్రమంగా నిల్వ చేయగా పోలీసులు శనివారం పట్టుకున్నారు. కమాన్‌బజార్‌లో నాళ్ల బాలకృష్ణ అనే వ్యక్తి నిల్వ చేసి ఉంచగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ కరుణాకర్ వెల్లడించారు. వాటికి లైసెన్స్ లేదని గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ
తిరుమలాయపాలెం: ఓ వృద్ధురాలి ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని దమ్మాయిగూడెంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అందరూ దుర్గామాత నిమజ్జనం హడావిడిగా ఉండగా.. గ్రామానికి చెందిన గోకినపల్లి లచ్చమ్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి పెప్పర్ స్ప్రే ముఖానికి కొట్టి, లైట్ ఆఫ్ చేసి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాలలో వంట పాత్రలు చోరీ
జూలూరుపాడు: జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట పాత్రలను చోరీ చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. దసరా సెలవుల అనంత రంపాఠశాలలను శనివారం తిరిగి ప్రారంభించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం సిద్ధం చేసేందుకు సిద్ధమవుతుండగా కొన్ని వంట పాత్రలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హెచ్‌ఎం లక్ష్మీనరసయ్య తెలిపారు.
పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలు
జూలూరుపాడు: పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రాంపురం తండాలో శనివారం జరిగింది. తండాకు చెందిన కొర్ర కవిత, ఆమె పదేళ్ల కుమారుడు సంతోష్, తోడి కోడలు జానులు పత్తి చేలోకి కోతులు రాకుండా కాపలా వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. పిడుగుపడటంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాధితులను ట్రాక్టర్ సాయంతో వాగు దాటించి, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థి మృతదేహం లభ్యం
సుజాతనగర్: బహిర్భూమికి వెళ్లి సాగర్ కాల్వలో పడి గల్లంతైన విద్యార్థి లోహిత్ హర్ష(15) మృతదేహం ఏన్కూరు పోలీసులకు శనివారం ఉదయం లభ్యమైంది. సుజాతనగర్‌కు చెందిన బొమ్మనబోయిన లోహిత్ హర్ష శుక్రవారం సాయంత్రం ఏన్కూరు మండలం రాజలింగాలకు సమీపంలోని సాగర్ కాల్వలో గల్లంతైన విషయం విదితమే. దీంతో ఏన్కూరు పోలీసులు, రెస్క్యూ టీం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమయింది. మృతదేహానికి ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుజాతనగర్‌లో మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.