
నేడు సీపీఐ సన్నాహక సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్ : సీపీఐ శతాబ్ది సంవత్సర ముగింపు ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో చారిత్రక సభ నిర్వహించనున్నామని, ఆ సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటుచేశామని పార్టీ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు జరిగే సన్నాహక సమావేశానికి పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా, జాతీయ నాయకులు బినయ్ విశ్వం, కె.నారాయణ, అజీజ్ పాషా, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల కార్యదర్శులు హాజరు కానున్నారని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సభకు 31 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సీపీఐ వందేళ్ల సుదీర్ఘ ప్రస్తానంలో అనేక చారిత్రక ఘట్టాలున్నాయని, నాటి పోరాట చారిత్రక ఘట్టాలను నేటి యువతరానికి తెలియజేసేందుకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, ఆ తర్వాత జరిగిన భూ పోరాటాల్లో సీపీఐ కీలక భూమిక పోషించిందన్నారు. వేల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి దక్కిందన్నారు. గ్రామ గ్రామాన శత సంవత్సర సంబరాల సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించి యువతను కార్యోన్ముఖులను చేస్తామని తెలిపారు.
బలానికి అనుగుణంగా పోటీ..
స్థానిక సంస్థల ఎన్నికలల్లో సీపీఐ బలానికి అనుగుణంగా పోటీ చేయనున్నట్లు హేమంతరావు తెలిపారు. జిల్లాలో కలిసివచ్చే రాజకీయ పార్టీలతో ఎన్నికల సర్దుబాటు ఉంటుందని వెల్లడించారు. సీపీఐకి బలం ఉన్న గ్రామాల్లో తప్పకుండా పోటీ చేస్తామని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తోందని, ఈ విషయంలో కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఎస్‌కే జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్ పాల్గొన్నారు.