
రూ.వెయ్యితో బతికేదెలా?
● పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల వేడుకోలు ● అధికారులతో సమానంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్
సింగరేణి(కొత్తగూడెం): నెలకు రూ.1000 పెన్షన్‌తో తమ జీవితం ఎలా గడపాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కనీస పెన్షన్ రూ.10వేలకు పెంచాలని, అధికారులతో సమానంగా వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. 1998లో ప్రవేశపెట్టిన కోల్‌మైన్స్ పెన్షన్ స్కీమ్ ప్రకారం కనీస పెన్షన్ రూ.350 నిర్ణయించారు. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని 27 ఏళ్లుగా కోల్ పెన్షనర్స్ అసోషియేషన్ నాయకులు ఆందోళన చేయగా రూ.1000కి పెంచారు. అయితే దీనికి డీఏ పెంపు వర్తించకపోవడంతో తాము అర్ధాకలితో అలమటిస్తున్నామని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు గాలికి..
కోల్ మైన్స్ పెన్షన్ స్కీం చట్ట ప్రకారం ప్రతీ మూడేళ్లకోసారి పింఛన్లను సవరించాలనే నిబంధన ఉంది. ఈ విషయమై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పారిశ్రామిక విని యోగదారుల ధరల సూచిక అనుసరించి కరువు భత్యం (డీఏ) అనుసంధానం చేస్తూ పెన్షన్ పెంచాలని రిటైర్డ్ ఉద్యోగులు అంటున్నారు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి జరిగే వేతన ఒప్పందంతో పాటు పెన్షన్ పెంచాలని కోరుతున్నా తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
జాతీయ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి..
కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అర్గనైజేషన్ రద్దు చేసి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, కోలిండియా, సింగరేణి ఆధ్వర్యంలో జాతీయ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు. దీంతో పాటు సోషల్ రెస్సాన్స్‌బిలిటీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, బొగ్గు యాజమాన్యం సంస్థలవార్షిక లాభాల నుంచి మూడు శాతం పెన్షన్ ఫండ్‌కు కేటాయించాలని, ఉద్యోగులకు, అధికారులకు ఒకే రకమైన వైద్య విధానం అమలు చేయాలని, హైదరారాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నెలకొల్పి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.