ఎక్కడెక్కడ.. ఎవరైతే సరి?! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడెక్కడ.. ఎవరైతే సరి?!

Oct 4 2025 2:09 AM | Updated on Oct 4 2025 2:09 AM

ఎక్కడెక్కడ.. ఎవరైతే సరి?!

ఎక్కడెక్కడ.. ఎవరైతే సరి?!

● చైర్మన్‌ పదవి కై వసం చేసుకునేలా వ్యూహరచన ● నాలుగే స్థానాలు ఎస్టీలకు.. పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ ● మంత్రులు, నేతల ఆధ్వర్యాన వడపోతకు కార్యాచరణ

జెడ్పీ చైర్మన్‌ పదవిపై గురి..

జెడ్పీటీసీ అభ్యర్థుల అన్వేషణలో కాంగ్రెస్‌
● చైర్మన్‌ పదవి కై వసం చేసుకునేలా వ్యూహరచన ● నాలుగే స్థానాలు ఎస్టీలకు.. పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ ● మంత్రులు, నేతల ఆధ్వర్యాన వడపోతకు కార్యాచరణ

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జెడ్పీ చైర్మన్‌ పదవిని కై వసం చేసుకునేలా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేలా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర నేతల ఆధ్వర్యాన కసరత్తు మొదలుపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురేసి చొప్పున అభ్యర్థులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. జెడ్పీ చైర్మన్‌ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో జిల్లాలోని ఆయా స్థానాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తం 20 జెడ్పీటీసీల్లో అత్యధిక స్థానాలతోపాటు ఎస్టీలకు రిజర్వ్‌ అయిన నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడమే అజెండాగా పార్టీ ముందుకు పోతోంది.

విజయావకాశాలే గీటురాయి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక పీసీసీ స్థాయిలో చేయనుండగా.. ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డుసభ్యులను జిల్లాస్థాయిలోనే ఎంపిక చేస్తారు. జిల్లా మంత్రులతోపాటు ఇన్‌చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు, ఇతర నేతల సమన్వయంతో ఈ ఎంపిక జరుగుతుంది. ఏయే స్థానంలో ఎవరిని బరిలోకి దింపితే గెలుస్తారనే వివరాలు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో అధికా రంలో ఉండడం, జిల్లాలోనూ కాంగ్రెస్‌కు బలం ఉండడంతో 90 శాతానికి పైగా స్థానాలను గెలుస్తామనే ధీమాతో పార్టీ ఉంది.

ఎస్టీ స్థానాలే లక్ష్యం

జిల్లాలోని మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యాయి. జెడ్పీ చైర్మన్‌ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో ఈ నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం శ్రద్ధ పెట్టింది. కూసుమంచి, కొణిజర్ల జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీ జనరల్‌కు, తిరుమలాయపాలెం, సత్తుపల్లి ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయ్యాయి. జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యేందుకు ఎస్టీ మహిళకు కూడా అర్హత ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలే కీలకంగా మారనున్నాయి. ప్రజాదరణ, ఆర్థిక బలంతోపాటు సమకాలీన రాజకీయాలపై అవగాహన, ప్రజలను ఆకట్టుకునే అభ్యర్థులను గుర్తించే పనిలో కాంగ్రెస్‌ నిమగ్నమైంది. ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినా ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వారికే చైర్మన్‌ పీఠం దక్కనున్నందున కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అన్ని స్థానాల్లో పోటాపోటీ

జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. పార్టీ అధికారంలో ఉండడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయని ఆశావహులు భావిస్తున్నారు. ఈ నేపథ్యాన పార్టీ కోసం కష్టపడిన తమకు అవకాశం ఇవ్వాలని నేతలను అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా జనరల్‌ స్థానాల్లో పోటీ మరింత తీవ్రంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత బీసీలకు అత్యధిక స్థానాల్లో పోటీచేసే అవకాశం వచ్చింది. దీంతో ఆయా సామాజిక వర్గం నేతలు మంత్రులు, ఇతర నేతలను కలిసి తమను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా జెడ్పీ చైర్మన్‌ పదవిపైనే దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో జెడ్పీచైర్మన్‌ పదవి బీఆర్‌ఎస్‌ను వరించగా.. ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలకు నేతలు పదును పెడుతున్నారు. జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు గెలవాలని తద్వారా చైర్మన్‌ పీఠం దక్కించుకునేలా బలమైన అభ్యర్థులను వడపోత తర్వాతే ఎంపిక చేయనున్నారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురేసి అభ్యర్థులను మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, ఎంపీ ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. ఇందులో ప్రజాదరణ కలిగి, ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు ఎలాంటి వివాదాలకు తావులేని వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆపై అభ్యర్థుల జాబితాలను 5వ తేదీలోగా పీసీసీకి పంపించాల్సి ఉండడంతో అన్వేషణ జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement