
సంబురాలను పంచిన దసరా
ఆలయాలకు పోటెత్తిన జనం
ఖమ్మం జమ్మిబండపై వైభవంగా వేడుక
ఖమ్మంగాంధీచౌక్: దసరా పండుగను జిల్లా ప్రజలు గురువారం ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా సంప్రదాయ పద్ధతుల్లో పండుగ నిర్వహించుకున్నారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తూ సంబురాల్లో బాగస్వాములయ్యారు. ఇళ్లలో ప్రత్యేక పూజలు అనంతరం ఇష్టమైన ఆలయాలను దర్శించారు. ఖమ్మంలోని జమ్మిబండపై జరిగిన వేడుకలకు వేలాదిగా జనం హాజరయ్యారు. అలాగే, ఖమ్మం గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం, శ్రీ గుంటుమల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి, భక్త ఆంజనేయ స్వామి తదితర ఆలయాలు కూడా కిటకిటలాడాయి. దసరా సందర్భంగా ఆలయాల వద్ద పలువురు వాహన పూజ చేయించుకున్నారు. ఇక శమీ పూజ కోసం ఆలయాలు, పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో జమ్మిచెట్ల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ కోరికలను కాగితంపై రాసి జమ్మి చెట్టుకు కట్టి మొక్కుకున్నారు. పలుచోట్ల నిర్వహించిన రావణ దహనంలో ప్రజలు పాల్గొన్నారు.
జమ్మిబండపై..
ఖమ్మంలోని శ్రీ స్తంబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. గుట్టపై ఆలయం నుంచి స్వామి వారిని పల్లకీ సేవగా జమ్మిబండపైకి చేర్చారు. అక్కడ నిర్వహించిన శమీ పూజలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, స్తంభాద్రి ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ
ఖమ్మంక్రైం: జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దసరా సందర్భంగా సీపీ సునీల్‌దత్ అధ్వర్యాన ఆయుధ పూజ నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజల్లో అడిషనల్ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, ఏసీపీలు మహేష్, సుశీల్‌సింగ్, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, నాగుల్‌మీరా, సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబురాలను పంచిన దసరా

సంబురాలను పంచిన దసరా